
కాలిఫోర్నియా: టెక్‌దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెర తీసింది. తన సర్వీస్ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాలకనుగుణం గానే టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకువస్తామని ప్రకటించింది.
యాపిల్ టీవీ యాప్‌ను కొత్త డిజైన్‌తో కొత్తగా లాంచ్ చేసింది. దాదాపు 100దేశాల్లో ఐఫోన్, ఐపాడ్, యాపిల్ టీవీ 4కె లో ప్రస్తుతానికి దీని సేవలు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్ స్మార్ట్‌టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, ఎల్‌సీ, సోనీ, రోకూ, విజియో ప్లాట్‌ఫాంలలో కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఇందులో అన్ని కొత్త మూవీ రిలీజ్‌లు, లక్షకుపైగా టైటిల్స్‌తో ఐ ట్యూన్స్ మూవీ కాటలాగ్‌ను అందిస్తుంది. అంతేకాదు యూజర్ల పర్సనల్ లైబ్రరినీ బిల్ట్ ఇన్‌గా అందిస్తుంది.
యాపిల్ టీవీ ప్లస్
ఇది స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వీడియో సర్వీస్. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా తన సేవలను అందిస్తుంది. అయితే సబ్‌స్క్రిప్షన్ వివరాలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. ఇందులో కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కంటెంట్ ఉంటుంది. దీనికోసం కంపెనీ 34 టీవీ, మూవీ ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
యాపిల్ టీవీ ఛానల్స్ సబ్‌స్క్రైబ్ సేవలను కూడా ఆవిష్కరించింది. ఇందులో హెచ్‌బీవో, స్టార్జ్, షోటైమ్, సీబీఎస్ ఆల్ యాక్సెస్, స్మిత్‌సోనియన్ ఛానల్, ఎపిక్స్, ఎంటీవీ హిట్స్ వంటి పలు పాపులర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకొని యాపిల్ టీవీ యాప్‌లో చూడొచ్చు. ఆన్ డిమాండ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నవి.
యాపిల్ న్యూస్
యాప్ యాపిల్ న్యూస్ ప్లస్ అనేది కంపెనీ న్యూస్ యాప్. ఇందులో వివిధ మేగజైన్ల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇదికూడా సబ్‌స్క్రిప్లన్ ఆధారిత సేవ. వైర్డ్, పాపులర్ సైన్స్, నేషనల్ జాగ్రఫీ అండ్ ఎసెన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దాదాపు 300 మేగజైన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
యాపిల్ క్రెడిట్ కార్డు
సొంతంగా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తామని యాపిల్ ప్రకటించింది. దీని పేరు యాపిల్ కార్డు. కంపెనీ క్రెడిట్ కార్డు కోసం గోల్డ్‌మన్ శాక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తుంది.



