
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజాఫర్‌బాద్‌లో కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమతో సేవలు చేయించుకుంటున్న ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా తీరని అన్యాయం చేస్తోందని పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యంతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో తమతో వెట్టి చాకిరి చేయించుకుంటూ.. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అటు పాక్‌లోనూ, ఇటు పీవోకేలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వాలు తమపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని నినదిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. 2012లో తమను రెగ్యులరైజ్ చేసినట్లు సాక్షాత్తు పాక్ సుప్రీం కోర్టే తీర్పిచ్చినప్పటికీ వాటిని పాక్, కశ్మీర్ (పీవోకే) ప్రభుత్వాలు లెక్క చేయకుండా తమను కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.