అమెరికా రక్షణ బడ్జెట్‌ 49 లక్షల కోట్లు

America Was Always Great at Spending Money on the Military - Sakshi

భారత్‌కు ఆంక్షల నుంచి మినహాయింపు

పాకిస్తాన్‌ సాయంలో కోత

వాషింగ్టన్‌: రక్షణ రంగంలో భారత్‌తో భాగస్వామ్యం బలోపేతం కావాలని అమెరికా కాంగ్రెస్‌ కోరింది. అమెరికా కాంగ్రెస్‌ 2019 సంవత్సరానికి గాను 716 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 49 లక్షల కోట్లు) రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదం పొందాక చట్టంగా రూపుదాల్చనుంది. బిల్లు ప్రకారం..రక్షణశాఖకు చెందిన క్షిపణి వ్యవస్థలతోపాటు వైమానిక, తీర ప్రాంత దళాలను నవీకరించనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే శత్రుదేశాలతో ఆయుధ ఒప్పందాలు చేసుకునే దేశాలపై అమెరికా విధించే ఆంక్షల నుంచి భారత్‌కు ఊరట లభించనుంది. భారత్‌ వంటి ప్రాధాన్య దేశాలను ఆంక్షల నుంచి మినహాయించాలని కాంగ్రెస్‌ కోరింది. ఇటీవల 4.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎస్‌–400 క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్‌ తీర్మానంతో భారత్‌కు ఊరట లభించినట్లయింది.  

భారత్‌కు రక్షణ భాగస్వామి హోదా
భారత్‌ సైనిక బలగాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ యంత్రాంగాన్ని కాంగ్రెస్‌ కోరింది. ‘ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలతో  ప్రాంతీయ భద్రత, రక్షణ అంశాల్లో మైత్రి బలపడాలి. భారత్‌ రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, వ్యూహాత్మక కార్యక్రమాలు చేపట్టడానికి వీలుకల్పించే ‘మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌’ హోదాను భారత్‌కు ఇచ్చేందుకు గల అవకాశాలను అన్వేషించాలి’ అని పేర్కొంది.  

పాక్‌కు సాయంలో భారీ కోత
అమెరికా తాజా రక్షణ రంగ బడ్జెట్‌లో పాకిస్తాన్‌కు 150 మిలియన్‌ డాలర్లు(వెయ్యి కోట్ల రూపాయలు) మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం తెలిపింది. మునుపెన్నడూ కూడా ఇంత తక్కువ సాయాన్ని పాక్‌ అందుకోలేదు. అయితే, ఈ సాయం అందించినందుకు గాను ఎలాంటి షరతులు, నిబంధనలను విధించలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top