గజరాజులకు మంచి రోజులు 

america ban on import of elephant trophies - Sakshi - Sakshi

వాషింగ్టన్‌: వన్యప్రాణుల సంరక్షణ కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ దేశంలోకి ఏనుగు దంతాల దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశాధ్యక్షుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఏనుగుల వేటను ‘హారర్‌ షో’గా అభివర్ణించారు. ఆఫ్రికా దేశాలైన జాంబియా, జింబాబ్వేల నుంచి దిగుమతి అయ్యే ఏనుగు దంతాలపై నిషేధాన్ని విధిస్తున్నట్లు స్పష్టంచేశారు. అమెరికా మత్స్య, వన్యప్రాణి సేవా విభాగం ఏనుగు దంతాల దిగుమతిపై నిషేధాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్‌ తాత్కాలికంగా నిలిపివేశారు. వారంరోజుల తర్వాత దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న ట్రంప్‌.. అంతలోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏనుగుల వేట తనను చాలా కదిలించిందని, దంతాల కోసం వాటిని హతమార్చడం హారర్‌ షో లాంటిదని ట్రంప్‌ పేర్కొన్నారు.

తాము తీసుకున్న నిర్ణయం ఏనుగుల ప్రాణాలను కాపాడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒబామా హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలను ఒక్కొక్కటిగా సమీక్షిస్తున్న ట్రంప్‌ సర్కార్‌.. దాదాపుగా అన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగానే కొత్త చట్టాలను అమలు చేస్తూ వచ్చింది. అయితే ఏనుగుల దంతాల దిగుమతి విషయంలో మాత్రం ఒబామా సర్కార్‌ తీసుకున్న నిర్ణయానికే ట్రంప్‌ మద్దతు పలికారు. ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకోకపోతే మరో రెండుమూడేళ్లలో ఏనుగులు అంతరించిపోతాయన్న వన్యప్రాణి సంరక్షణ సంస్థల హెచ్చరికల నేపథ్యంలోనే ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top