పాకిస్తానీయులు ఎక్కువగా వెతికింది వీరి కోసమే! | Sakshi
Sakshi News home page

ఆ జాబితాలో అభినందన్‌, సారా అలీఖాన్‌!

Published Thu, Dec 12 2019 8:36 AM

Abhinandan Varthaman And Sara Ali Khan Placed Most Searched Personalities In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: ఈ ఏడాదిగానూ పాకిస్తానీయులు గూగుల్‌లో అత్యధికంగా వెదికిన వ్యక్తుల జాబితాలో భారత వైమానిక దళ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌లు టాప్‌-10లో నిలిచారు. పాకిస్తాన్‌లో అత్యధిక మంది వీరికి సంబంధించిన సమాచారం గురించే వెదికినట్లు సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ పేర్కొంది. అదే విధంగా ఇండియన్‌ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌- 13, మోటూ పాట్లూ షోపై కూడా వారు అత్యంత ఆసక్తిని కనబరిచారని వెల్లడించింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ విమానాన్ని వెంబడిస్తూ అక్కడి భూభాగంలో దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేసినా రహస్య సమాచారం వారికి ఇవ్వకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత్‌తో పాటు పాక్‌ మీడియా కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.

ఇక సారా అలీఖాన్‌.. పటౌడీ వంశ వారసురాలు, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సారా.. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు పొందారు. అదే విధంగా వివిధ కార్యక్రమాల్లో తన కట్టూబొట్టుతో ఫ్యాషన్‌ ఐకాన్‌గా యువతలో ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుణ్‌ ధావన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ నంబర్‌.1’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా భారతీయులు ఆర్టికల్ 370, అయోధ్య కేసు, జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ) అంటే ఏమిటి తదితర అంశాల గురించి అత్యధికంగా వెదికినట్లు గూగుల్‌ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే.(మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?)

Advertisement

తప్పక చదవండి

Advertisement