ఈశాన్య, తూర్పు రాష్ట్రాలను సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. మణిపూర్ కేంద్రంగా తెల్లవారుజామున దాదాపు 4:30 గంటలకు సంభవించిన...
* 9 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు
* మణిపూర్ తదితర రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు
* బంగ్లాదేశ్‌లో ఐదుగురు మృత్యువాత
* రిక్టర్ స్కేల్‌పై 6.8గా భూకంప తీవ్రత
ఇంఫాల్/గువాహటి/ఢాకా: ఈశాన్య, తూర్పు రాష్ట్రాలను సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. మణిపూర్ కేంద్రంగా తెల్లవారుజామున దాదాపు 4:30 గంటలకు సంభవించిన ఈ భూకంపంలో మొత్తం తొమ్మిది మంది మృతిచెందగా (మణిపూర్‌లో ఏడుగురు, బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు గుండెపోటుతో మృతి) 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదవగా మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 17 కి.మీ లోతున భూకంప కేంద్రం నమోదైంది. ఈ ప్రాంతంలో చాలా భవనాలు కుప్పకూలాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అస్సాం, మిజోరం, త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలతోపాటు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లో ఐదుగురు మృతిచెందగా దాదాపు 100 మంది గాయపడ్డారు.
కేంద్రం సహాయ చర్యల కోసం మణిపూర్, అస్సాంలకు సైనిక, వైమానిక, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది. అస్సాం పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని సహాయ చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. కాగా, చిత్రం షూటింగ్ కోసం కోల్‌కతాలో ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ‘ట్వీటర్’లో భూకంప వార్తను ట్వీట్ చేశారు. నిద్రిస్తుండగా మంచం ఊగిపోవడంతో ఆశ్చర్యపోయానన్నారు.