బొమ్మ తుపాకీ అనుకొని అన్నను కాల్చేశాడు.. | Sakshi
Sakshi News home page

బొమ్మ తుపాకీ అనుకొని...

Published Tue, Apr 3 2018 6:32 PM

5 Year Old Boy Think Gun As Toy And Shot His Brother In US - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోని గన్‌ కల్చర్‌ వల్ల కలిగే నష్టానికి, వీడియో గేమ్‌లు పిల్లల మీద చూపే దుష్ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన. నిజమైన తుపాకీని... బొమ్మ తుపాకీగా భావించి ఏడేళ్ల సోదరుడిని కాల్చి చంపాడు ఐదేళ్ల తమ్ముడు. విషాదం నింపిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో చోటు చేసుకుంది. ఏడేళ్ల జెర్మన్‌ పెర్రి సౌత్‌ సెంట్‌ లూయిస్‌లోని తమ ఇంట్లో బెడ్‌రూమ్‌లో కూర్చుని వీడియో గేమ్‌ ఆడుకుంటున్నాడు. తల్లి వంటగదిలో ఉంది. పెర్రి తమ్ముడు చాక్లెట్ల కోసం తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి కప్‌బోర్డులో వెతకడం ప్రారంభించాడు.

కప్‌బోర్డులో చాక్లెట్లకు బదులు ఆ చిన్నారికి  గన్‌ దొరికింది. దాన్ని తీసుకుని తమ గదిలోకి వెళ్లాడు. అక్కడ వీడియో గేమ్‌ ఆడుకుంటున్న సోదరుడిని కాల్చాడు. ఇదంతా ఆ పసివాడికి తాను నిత్యం ఆడే వీడియో గేమ్‌లానే తోచింది. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం విన్న తల్లిదండ్రులు ఆ గదిలోకి వచ్చి చూసేసరికి పెర్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెర్రీ మృతి చెందాడు. మృతుడి తండ్రి జెరికో పెర్రీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ బాలుడు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్‌ ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement