పాక్‌లో 22 ఉగ్ర శిబిరాలు

22 terrorist training camps active in Pakistan - Sakshi

వాటిలో తొమ్మిది మసూద్‌వే

భారత అధికారి వెల్లడి

వాషింగ్టన్‌/ ఇస్లామాబాద్‌/జాబా: పాకిస్తాన్‌లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో తొమ్మిది శిబిరాలు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్‌ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్‌లో ఉంటున్న ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. సరిహద్దు ఆవల నుంచి భారత దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే ప్రభుత్వం బాలాకోట్‌ తరహా దాడులు చేస్తుందని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు.

‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్‌. తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్‌ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. తన గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్యా తీసుకోని పాకిస్తాన్‌ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని, రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

చట్టాలకు అనుగుణంగానే..
బాలాకోట్‌పై భారత్‌ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్‌ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్‌ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందన్నారు. భారత్‌పై ఉగ్ర దాడికి పాక్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్‌ దాడి ద్వారా భారత్‌ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్‌ సర్కారు భారత్‌కు మద్దతిస్తోందన్నారు. పాక్‌ అభివృద్ధికి ఐఎంఎఫ్‌ 21 సార్లు ఆర్థిక సాయం చేస్తే ఆ దేశం ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు.

చెట్లు కూల్చారని కేసు
భారత వైమానిక దళానికి చెందిన గుర్తుతెలియని పైలట్లపై పాక్‌ కేసు వేసింది. బాలాకోట్‌లోని 19 చెట్లపై బాంబులు వేసి కూల్చివేసినందుకు శుక్రవారం ఈ కేసు వేసింది. జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం సర్జికల్‌ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ అటవీ శాఖ ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిసింది. కాగా, బాలాకోట్‌లోని ఐఏఎఫ్‌ దాడి జరిపిన మదరసా, ఇతర భవనాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పాకిస్తాన్‌ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రాయిటర్స్‌కు చెందిన ప్రతినిధులు మూడుసార్లు ప్రయత్నించినా పాక్‌ బలగాలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ మదరసా ఉన్న ప్రాంతానికి వెళ్లే దారులను మూసివేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top