కోవిడ్‌తో విలవిల..

1523 newly confirmed cases of coronavirus in China - Sakshi

1,523కు చేరుకున్న మరణాల సంఖ్య

66 వేల మందికి వ్యాధి

చైనా ఆరోగ్య కమిషన్‌ వెల్లడి

బీజింగ్‌: చైనాలో కోవిడ్‌–19 మృతుల సంఖ్య రోజురోజుకూ ఎగబాకుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్‌ బారిన పడి 1,523 మంది మరణించగా మొత్తం 66వేల మంది దీని బారినపడినట్లు నిర్ధారణ అయిందని చైనా ఆరోగ్య కమిషన్‌ శనివారం వెల్లడించింది. చైనా మొత్తమ్మీద కోవిడ్‌ బారిన పడినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 66,492కు చేరుకోగా, వీరిలో 11, 053 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8096కు పెరిగింది. కోవిడ్‌ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోందని చైనా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని, వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న హుబే ప్రాంతం మినహా మిగిలిన చోట్ల తగ్గుదల నమోదవుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా.. కోవిడ్‌–19ను నియంత్రించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బిగ్‌ డేటా వంటి టెక్నాలజీలను వాడాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.

ఆ తల్లీ బిడ్డ డిశ్చార్జ్‌
కోవిడ్‌ బారినపడ్డ 67 రోజుల వయసున్న పసిబిడ్డ చికిత్స తర్వాత∙ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి విడుదలైంది. జియాంగ్‌ అనే ఇంటిపేరున్న ఈ బిడ్డను హుబేలోని సెంట్రల్‌ ఆసుపత్రిలో చేర్చారు. గుయిఝూ ప్రాంతం నుంచి సెలవులు గడిపేందుకు గత నెల 16న హుబే వచ్చిన జియాంగ్‌ తల్లిదండ్రులకు వ్యాధి సోకినట్లు జనవరి 25న నిర్ధారణ అయింది. ఇదే సమయంలో బిడ్డలోనూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో ఫిబ్రవరి రెండవ తేదీ జియాంగ్‌ను ఆసుపత్రిలో చేర్పించడం తెల్సిందే.

వచ్చే వారం 406 మంది విడుదల?
ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వూహాన్‌ నుంచి తీసుకొచ్చి ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచిన 406 మందిని వచ్చే వారం విడుదల చేసే వీలుంది. కోవిడ్‌ సోకలేదని నిర్ధారణ చేసుకున్నాకే విడుదలచేస్తారని అధికారులు శనివారం తెలిపారు. 650లో 406 మందిని న్యూఢిల్లీలోని ఐటీబీపీ కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచగా, మిగిలిన వారిని మానేసర్‌లోని సైనిక శిబిరంలో పర్యవేక్షణలో ఉంచారు.

ఆ కరెన్సీ నోట్ల చలామణీ బంద్‌
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైరస్‌ను నియంత్రించే లక్ష్యంతో తాజాగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న ప్రాంతాల్లోని కరెన్సీ నోట్ల చలామణీని తాత్కాలికంగా ఆపేశారు. ఈ నోట్ల ద్వారా వైరస్‌ ఇతరులకు సోకుతుందేమో అన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టినట్లు అంచనా. పాతనోట్ల స్థానంలో  కొత్తనోట్లు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వైస్‌ గవర్నర్‌ ఫాన్‌ వైఫీ తెలిపారు.

కోవిడ్‌కు విరుగుడుగా చైనా వైద్యం?
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చైనా సంప్రదాయ వైద్యాన్ని సమర్థంగా ఉపయోగిస్తోంది. వ్యాధి సోకిందని నిర్ధారణ అయిన వారిలో కనీసం సగంమందికి సంప్రదాయ వైద్యంతో సాంత్వన చేకూరిందని చైనా ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబేలో తాము అల్లోపతితోపాటు చైనీస్‌ వైద్యం అందించడం మొదలుపెట్టామని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు వాంగ్‌ హెషింగ్‌ తెలిపారు. అల్లోపతి వైద్యంలో కరోనా వైరస్‌ నివారణకు నిర్దిష్టమైన చికిత్సలేకపోవడంతో ఈ వార్తకు ప్రాధాన్యమేర్పడింది.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top