ఆమె పాట మూగపోరాదు! | 15-year-old Alexis Gould had neuroblastoma, cancer of the nerves | Sakshi
Sakshi News home page

ఆమె పాట మూగపోరాదు!

Feb 23 2016 8:44 PM | Updated on Oct 20 2018 7:38 PM

ఆమె పాట మూగపోరాదు! - Sakshi

ఆమె పాట మూగపోరాదు!

ఆవ్ మారియా...ఆవ్ మారియా అని ఆమె పాడుతూ ఉంటే ఆకాశం నుంచి అమృతగానం ఆలకిస్తున్నట్లు అనిపిస్తుంది. జగతిని మరచి దిగంతాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది.

మెక్సికో సిటీ: ఆవ్ మారియా...ఆవ్ మారియా అని ఆమె పాడుతూ ఉంటే ఆకాశం నుంచి అమృతగానం ఆలకిస్తున్నట్లు అనిపిస్తుంది. జగతిని మరచి దిగంతాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. ఆమె పాట పోప్‌ను కూడా కన్నీటి పర్యంతం చేసింది. ఆమే15 ఏళ్ల అలెక్సియా గార్డు. ఆమె సంగీత విద్వాంసురాలు కాదు. ఎప్పుడూ సంగీత పాఠాలు కూడా నేర్చుకోలేదు. డిస్నీ సినిమాల్లో వచ్చే పాటలను అనుకరిస్తూ తనలో తాను పాడుకునేది. కనీసం కుటుంబ సభ్యుల ముందు కూడా పాడేందుకు ఎన్నడూ సాహసించలేదు.

 పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మెక్సికో సిటీకి వచ్చినప్పుడు ఉద్వేగంతో పాట అందుకున్నారు. పోప్ కదిలిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. నిండు నూరేళ్లు బతకాలంటూ ఆ అమ్మాయిని దీవించి వెళ్లారు. అవును అంతటి ఆమె పాట మూగపోకూడదు. బోన్ మారో కేన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు ఫిబ్రవరి 25వ తేదీనే ఆపరేషన్. బోన్ మారో కేన్సర్ ప్రాణాంతమైనదైనప్పటికీ తొలి దశలోనే ఉన్నందున ఆమె ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండకపోవచ్చని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

 నగరంలోని చిల్డ్రన్స్ ఆస్పత్రిలో మొన్నటి వరకు అందరిలాగే అలెక్సియాను చూసిన డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఇప్పుడు ఆమెను సెలబ్రిటీలా చూసుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మెక్సికో సిటీ పర్యటన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తమ ఆస్పత్రిని సందర్శించినప్పుడు అలెక్సియా పాడిన పాటకు వారంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె పాట విని పోప్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో అలెక్సియా గురించి తొలిసారిగా ప్రపంచానికి తెల్సింది.

 పోప్ దీవెనలతో తనకు ఎనలేని ధైర్యం వచ్చిందని, కేన్సర్‌ను తప్పకుండా జయసిస్తాననే విశ్వాసం కలిగిందని అలెక్సియా మీడియాకు వివరించారు. ఆ రోజు పోప్ ముందు పాడాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని, అనుకోకుండా నోటి వెంట పాట దానంతట అదే జాలువారిందని ఆమె చెప్పారు. తాను పాడుతున్నప్పుడు లోకం ఎవరూ లేరని, తాను, పోప్ మాత్రమే ఉన్నట్టు, ఆయన కోసమే తాను పాడుతున్నట్టు అనిపించిందని ఆమె తెలిపారు. ఆత్మవిశ్వాసంతో గురువారం ఆపరేషన్‌కు వెళతానని చెప్పారు. నగరంలోని విస్టా హెర్మోసా అనే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అలెక్సియా గత నవంబర్‌లో కాలు నిలవక పడిపోయారు. కాలు నొప్పి తీవ్రమైంది. ముందుగా మామూలు జబ్బనుకున్నారు. తర్వాత పరీక్షల్లో ఆమెకు బోన్ కేన్సర్ అని తేలింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement