
సాధారణంగా ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్‌లో, సెలూన్స్ వంటి వాటిలో ఎలుకలు ఉండటం, గోడలపై బల్లులు తిరగటం సహజమైన విషయమే. అయితే చైనాలోని ఓ స్పా యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్ సీలింగ్ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడటంతో అక్కడికి వెళ్లి చుశాడు. సుమారు 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పామును పట్టుకున్నారు.
నవంబర్ 12న జరిగిన ఈ ఘటన గురించి స్పా యజమాని మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆ కొండచిలువ ఇక్కడే ఉంటుందని, పార్లర్ నిర్మాణ సమయంలో, మరమ్మత్తుల సమయంలో ఇక్కడ కొండచిలువను చూసినట్లు కార్మికులు చాలాసార్లు తనతో చెప్పినట్లు తెలిపాడు. అయితే దానిని పట్టుకోవడానికి పలుమార్లు యత్నించామని.. అయినా అది దొరకలేదని చెప్పాడు. ఇక ఆ భారీ పైథాన్‌ను స్థానిక వన్యప్రాణుల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.