
సెక్స్‌రాకెట్ బాధిత మహిళల కన్నీళ్ల మాటేమిటి?
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏదో అన్నారని ఓ దళిత ఎమ్మెల్యేతో అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టించారు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏదో అన్నారని ఓ దళిత ఎమ్మెల్యేతో అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టించారు.. మరి రాష్ట్రవ్యాప్తంగా కాల్‌మనీ సెక్స్ రాకెట్ ఉచ్చులో పడి వేలాది మంది మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.. వారి కన్నీళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మంగళవారం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, విశ్వాస రాయి కళావతి, పుష్పశ్రీవాణి, రాజేశ్వరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
వడ్డీకి తీసుకున్న మహిళల్నే కాదు వారి కూతుళ్లను కూడా చెరపట్టి వ్యభిచార రొంపిలోకి దించిన నాయకులపై, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘జగన్ కుటుంబంలో మహిళకు ఇలాంటి అవమానం జరిగితే ఊరుకుంటారా అని ఎమ్మెల్యే అనితతో మాట్లాడించారు..మరి రాష్ట్రవ్యాప్తంగా ఇంత మంది సెక్స్‌రాకెట్‌లో ఇరుక్కుని బాధిత మహిళలుగా మిగిలారు.
ఇలాంటి పరిస్థితి చంద్రబాబు ఇంట్లో మహిళలకు జరిగితే ఊరుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నామన్నారు.
బాబు మాటలకు చేతలకు పొంత ఉందా?: సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు అసలేమైనా పొంతన ఉందా అని మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ‘విశాఖపట్నంకు సీఎం వచ్చినప్పుడు బాక్సైట్ విషయంలో అన్యాయం జరగనివ్వం అన్నారు, ఆ తర్వాత మూడు రోజులకే నవంబర్ 5న జీవో నెం.97ను ఇచ్చారు...బాబు మాటలను ఎవరైనా నమ్ముతారా’ అని మండిపడ్డారు.