వ్యవసాయ యంత్రాల జాడేదీ!
ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది.
- ఖరీఫ్ ప్రారంభమైనా నిర్లక్ష్యం
- ధరలు ఖరారైనా వాటికి ఆమోద ముద్ర వేయని ఆగ్రోస్
- నిధుల్లేక ఈ ఏడాది హాలిడే ప్రకటిస్తారన్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. ఇప్పటికీ వాటి ధరలను ప్రకటించలేదు. మార్కెట్‌లో అన్ని సరుకులకూ జీఎస్టీకి అనుగుణంగా ధరలు ప్రకటించినా, ఆ శాఖ మాత్రం జీఎస్టీని సాకుగా చూపి యంత్రాల ధరలు ప్రకటించలేదు. దుక్కిదున్నే యంత్రాల నుంచి స్ప్రేయర్ల వరకు సన్న, చిన్నకారు రైతు ఉపయోగించే పరికరాలు అందుబాటులో లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ధరలు ప్రకటిస్తారో కూడా అధికారులు చెప్పట్లేదు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌లో రూ.337 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్రం నుంచి మరో రూ.134 కోట్లు రానున్నాయి.
అసలు కారణాలేంటి?
జీఎస్టీని వర్తింపజేసి ధర ఖరారు చేయడానికి కంపెనీలకు పెద్ద ఇబ్బందేమీ లేదు. కానీ జీఎస్టీ కారణంగా ఆగ్రోస్ వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ధరల జాబితా తయారు చేసి ఆగ్రోస్ యంత్రాంగం ఫైలును సిద్ధం చేసింది. దానిపై సంతకం చేయడానికి ఆగ్రోస్ ఎండీ వీరబ్రహ్మయ్య ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆయన సహకార కమిషనర్‌గా, ఆగ్రోస్ ఇంచార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. తిరిగొచ్చాక వీరబ్రహ్మయ్యకు ఆగ్రోస్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడలేదని చెబుతున్నారు.
సహకార బాధ్యతల వరకే తిరిగి ఉత్తర్వులు ఇచ్చారని, ఆగ్రోస్‌కు ఇవ్వనందున రావట్లేదని తెలిసింది. మరోవైపు ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌రావుకు, ఎండీ వీరబ్రహ్మయ్యకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరబ్రహ్మయ్య తనకు ఆగ్రోస్ బాధ్యతలు వద్దని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఈ రెండు కారణాలతో ఆయన ఆగ్రోస్ వైపే చూడట్లేదు. దీంతో యంత్రాల ధరల జాబితా ఫైలు ఎవరితో సంతకం చేయించాలో తెలియక అధికారులు గందరగోళంలో ఉండిపోయారు.
హాలిడే ప్రకటిస్తారా?
గతేడాది సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలకు సంబంధించి కంపెనీలకు చెల్లించాల్సిన సొమ్ములో రూ.100 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఏడాదికి యంత్రాలివ్వాలంటే పాత బకాయిలు తీర్చడంతో పాటు, ఈ ఏడాది బడ్జెట్ నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది హాలిడే (విక్రయాలు దాదాపు ఎక్కువ శాతం నిలిపేసి) నెట్టుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్నుత్నట్లు చెబుతున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున వచ్చే ఏడాది అధికంగా యంత్రాలు సరఫరా చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు ఆగ్రోస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాదికి గ్రీన్‌హౌస్ కోసం వచ్చే ఏ దరఖాస్తుకూ ఉద్యానాధికారులు అనుమతివ్వట్లేదు. వ్యవసాయ యంత్రాలపై ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది.