
వేతనాలివ్వండి మహాప్రభో!
నేతి బీరలో నెయ్యి చందమంటే ఇదేనేమో! పేరుకు ప్రజాప్రతినిధి. కానీ వారి వద్ద నిధి ఉండదు. నెలనెలా గౌరవ వేతనం ఇవ్వాలి.
► రాష్ట్రంలో ఎంపీటీసీలకు ఆరు నెలలుగా అందని గౌరవ వేతనాలు
► సర్కారు ఉత్తర్వులిచ్చి నెలరోజులైనా విడుదల కాని నిధులు
సాక్షి, హైదరాబాద్: నేతి బీరలో నెయ్యి చందమంటే ఇదేనేమో! పేరుకు ప్రజాప్రతినిధి. కానీ వారి వద్ద నిధి ఉండదు. నెలనెలా గౌరవ వేతనం ఇవ్వాలి. కానీ వేతనం సక్రమంగా అందదు. ఇదీ మండల పరిషత్ ప్రాదేశిక కమిటీ(ఎంపీటీసీ)సభ్యుల దుస్థితి. అభివృద్ధి నిధులు, రాజ్యాంగం కల్పించిన అధికారాల కోసం ఎంపీటీసీలు ఎంత కొట్లాడినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,441మంది ఎంపీటీసీలున్నారు. వీరికి నెలనెలా రూ.5 వేల చొప్పున, 438 మంది మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీ)కు రూ.10వేల చొప్పున ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం రావాల్సి ఉంది.
అయితే, గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంపీటీసీల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. కూలీకి వెళితే తప్ప రోజులు గడవని పరిస్థితి వారిది. వేతనం రాక, కూలీకి వెళ్లలేక సతమతమవుతున్నారు. రోజువారీ కుటుంబ ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెల 28న ఎంపీటీసీలు, ఎంపీపీల గౌరవ వేతనాల నిమిత్తం రూ.21.95 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సర్కారు ఉత్తర్వులిచ్చి నెలవుతున్నా, నేటికీ గౌరవ వేతన బకాయిలు తమ చేతికి అందలేదని ఎంపీటీసీలు వాపోతున్నారు.
మూడేళ్లనాటి బకాయిలకేదీ మోక్షం
2014–15 ఆర్థిక సంవత్సరంలో అందాల్సిన ఆరు నెలల వేతన బకాయిలకూ ఇప్పటిదాకా మోక్షం కలగలేదు. 2015 ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం అంతకు ముందు ఆరునెలల బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వేతన పెంపు కంటే ముందు ఎంపీటీసీలకు నెలకు రూ.750, ఎంపీపీలకు నెలకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంది.
గౌరవ వేతనంతోపాటు మండల పరిషత్ సమావేశాలకు హాజరైతే టీఏ, డీఏలను కూడా చెల్లించాల్సి ఉంది. 2014 అక్టోబరు నుంచి 2015 మార్చి నెలవరకు రూ.4.54 కోట్లు ప్రభుత్వం నుంచి ఎంపీటీసీలకు, ఎంపీపీలకు అందాల్సి ఉంది. మొత్తంగా రూ.26.49 కోట్లను ఎంపీటీసీలకు, ఎంపీపీలకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని తెలంగాణ ఎంపీటీసీల ఫోరం హెచ్చరిస్తోంది.
ఎంపీటీసీలపై సర్కారు చిన్నచూపు
ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగానే ప్రజలతో నేరుగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండడం దురదృష్టకరం. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిధులకు అధికారాలు, అభివృద్ధి పనులకు నిధులివ్వకుండా మండల, జిల్లా పరిషత్ వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంపీటీసీలు నెరవేర్చలేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇకనైనా ఎంపీటీసీలకు గౌరవ వేతనాలను ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఎమ్మెల్యేలకు మాదిరిగా ఎంపీటీసీలకు కూడా అభివృద్ధి నిధులను ఇవ్వాలి. – యు. మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి