గ్రామాల్లో జాడలేని ‘స్వచ్ఛ పక్వాడ’ | Villages clueless 'freedom pakvada' | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో జాడలేని ‘స్వచ్ఛ పక్వాడ’

Oct 15 2016 2:58 AM | Updated on Nov 9 2018 5:56 PM

‘స్వచ్ఛ పక్వాడా(పరిశుభ్రత పక్షోత్సవాలు)’ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు.

- జిల్లాల పునర్విభజన హడావుడిలో పట్టించుకోని అధికారులు
- క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
 
 సాక్షి, హైదరాబాద్ : ‘స్వచ్ఛ పక్వాడా(పరిశుభ్రత పక్షోత్సవాలు)’ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు. పరిశుభ్రత  గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికిగాను ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి 15 వరకు పంచాయతీల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి శారద మురళీధరన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో పరిశుభ్రత పక్షోత్సవాలు జరిగిన తీరు గురించి ఈ నెలఖారులోగా సమగ్ర నివేదికను కూడా పంపాలని కోరారు. అయితే, ‘స్వచ్ఛ పక్వాడ’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా తూతూమంత్రంగా వ్యవహరించారు.

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఏఏ కార్యక్రమాలు చేయాలో సూచిస్తూ షెడ్యూల్‌ను జిల్లా పంచాయతీ అధికారులకు చేతులు దులుపుకున్నారు. 15 రోజులపాటు పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన నిధులను ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కేటాయించలేదు. పక్షోత్సవాలను పర్యవేక్షించిన నాథుడు లేడు. ఈ నెల ఆరంభం నుంచే రాష్ట్రంలో అత్యంత వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు మొదలు కావడం, ఆపై దసరా, మొహర్రం పండుగలు రావడంతో ప్రజలంతా పండుగ ధ్యాసలో ఉన్నారని, పక్షోత్సవాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావడంతో ఆయా జిల్లాలకు పంచాయతీ అధికారుల నియామకం, ఉద్యోగుల విభజనతో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయామంటున్నారు.

 స్వచ్ఛ పక్వాడా జరగాల్సింది ఇలా..
 అక్టోబర్ 1న గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు, పంచాయతీరాజ్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కో రకమైన కార్యక్రమం చేపట్టాలని కేంద్రం సూచించింది. వాటిల్లో ప్రధానంగా అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహించాల్సి ఉంది. పక్షోత్సవాల చివరి రోజైన అక్టోబర్ 15న  అన్ని గ్రామ పంచాయతీల్లోనూ మరోమారు గ్రామసభ నిర్వహించి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement