
గ్రూప్-2 రెండు నెలలు వాయిదా
తెలంగాణలో టీఎస్‌పీస్‌సీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలు రెండు నెలలు వాయిదా పడనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : తెలంగాణలో టీఎస్‌పీస్‌సీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలు రెండు నెలలు వాయిదా పడింది. వీటితో పాటూ కానిస్టేబుల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే ఎస్ఐ పరీక్షల్లో ఇంగ్లీష్ వెయిటేజీ రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది.
గ్రూప్-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, 439 నుంచి 3,500 వరకు పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల నుంచి గత కొంత కాలంగా డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. కాగా షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ 24, 25 తేదీలలో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో పాటు సిలబస్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం... తదితర అంశాలతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ అభ్యర్థుల కారణంగా...ఎస్ఐ పరీక్షల్లో ఇంగ్లీష్ వెయిటేజీ విధానాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.