అఫిడ‘ఒట్టు’..!

Traffic police introduce Affidavit for drunken drive peoples - Sakshi

నగరంలో కుటుంబీకులెవరూ లేని మందుబాబులకు ఓ చాన్స్‌ 

సంరక్షకుడితో కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అనుమతి

అఫిడవిట్‌ సమర్పిస్తే ‘పరారీలోని’ నిషాచరులకు అవకాశం ఇప్పటి వరకు అఫిడవిట్లు సమర్పించిన 17 మంది

మోసం చేసేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులేనని ట్రాఫిక్‌ పోలీసుల హెచ్చరిక

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నగరంలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కాడు. వాహనం పోలీసుల వద్దే ఉండిపోవడం, కౌన్సెలింగ్‌కు కుటుంబీకులతో హాజరుకావాల్సి ఉండటం, యూపీలో ఉంటున్న వారు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో పడ్డాడు.

బంజారాహిల్స్‌లో నివసించే యువకుడి తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉంటారు. సోదరులు లేరు.. నగరంలో బంధువులెవరూ నివసించడం లేదు. మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన ఈ యువకుడి వాహనం సైతం ట్రాఫిక్‌ పోలీసుల దగ్గరే ఉండిపోయింది.

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలో నివసిస్తున్న అనేక మంది ‘నాన్‌–లోకల్స్‌’, కొందరు ‘లోకల్స్‌’ పరిస్థితి ఇది. ఫలితంగా ‘పరారీలో ఉన్న మందుబాబుల’ సంఖ్య పెరగడంతో పాటు అనేక ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లలో వారి వాహనాలు పేరుకుపోయి వాటి పరిరక్షణ భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ‘అఫిడవిట్‌’దాఖలు చేసే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే 17 మంది దీన్ని వినియోగించుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

తక్షణం వాహనం స్వాధీనం..
నిబంధనల ఉల్లంఘనల్ని ట్రాఫిక్‌ పోలీసులు మూడు రకాలుగా పరిగణిస్తారు. వాహనచోదకుడికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పు కలిగించేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు కలిగించేవి. మొదటి రెండింటి కంటే మూడో దాన్నే తీవ్రమైనదిగా పరిగణిస్తారు. మద్యం తాగి వాహనాలు నడపటం ఈ కోవలోకే వస్తుంది. రోడ్డు ప్రమాదాలు నిరోధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారాంతాలతో పాటు ఆకస్మికంగానూ స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపడుతున్నారు.

తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి నుంచి తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌(టీటీఐ)లో కౌన్సిలింగ్‌కు హాజరైన తర్వాత కోర్టుకు రావాల్సి ఉంటుంది. న్యాయస్థానం విధించే జరిమానా చెల్లించడం, జైలు శిక్ష వేస్తే అది పూర్తి చేసుకుని రావాలి. ఈ తతంగం ముగిసే వరకు వాహనం ట్రాఫిక్‌ పోలీసుల అధీనంలోనే ఉంటుంది.

‘విషయం’ తెలియడం ఇష్టం లేక..
స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ‘నిషా’చరులు ఆ తర్వాతి వారంలో టీటీఐ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. దీనికి వారితోపాటు కుటుంబంలో ఎవరో ఒకరిని తీసుకురావాలి. వివాహితులు భార్య, అవివాహితులు తల్లిదండ్రులు, సోదరుడు, సమీప బంధువుతో హాజరుకావాలి. అయితే కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి కొందరు మందుబాబులు తెలివిగా వ్యవహరిస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు.

స్నేహితులు, పరిచయస్తుల్ని కుటుంబీకులుగా చూపిస్తూ కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్‌ చెప్పడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి చేస్తున్నారు. ‘నిషా’చరుడితోపాటు అతని వెంట వచ్చిన వారి ఆధార్‌ వివరాలను సరిచూస్తూ.. అసలు కుటుంబీకులు ఎవరు? నకిలీ కుటుంబీకులు ఎవరు? అనేది గుర్తిస్తున్నారు. అయితే మందుబాబుల్లో చాలా మంది విషయం కుటుంబీకులకు తెలియడానికి ఇష్టపడట్లేదు. మరికొందరి కుటుంబీకులు నగరంలో ఉండట్లేదు. దీంతో కౌన్సెలింగ్‌కు హాజరు కాకుండా ‘పరారీలో’ఉండిపోతున్నారు.

ఓ అవకాశం కల్పించాలనే..
‘పరారీలో’ ఉండిపోతున్న వారి వివరాలు సేకరించిన ట్రాఫిక్‌ పోలీసులు ఓ అధ్యయనం చేశారు. ఇలాంటి వారిలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని గుర్తించారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన వారు నగరానికి చెందిన వారైనా వారి కుటుంబీకులు విదేశాల్లో ఉండటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని తేల్చారు. ఇలాంటి వారికి ఓ అవకాశం ఇవ్వడానికి అఫిడవిట్ల విధానం ప్రారంభించారు. దీంతో వారు తమ వారెవ్వరూ నగరంలో లేరంటూ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ సమర్పించాలి.

అలా చేస్తే స్నేహితులతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదైనా అఫిడవిట్‌పై అనుమానం వస్తే దాన్ని దాఖలు చేసిన వ్యక్తి నివసించే ప్రాంతానికి చెందిన స్థానిక పోలీసుల ద్వారా తనిఖీ చేయించాలని నిర్ణయించారు. ఇందులో ఆ వ్యక్తి తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చినట్లు తేలితే క్రిమినల్‌ కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top