బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి | The boy poured kerosene on | Sakshi
Sakshi News home page

బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి

Oct 9 2014 1:09 AM | Updated on Sep 2 2017 2:32 PM

బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి

బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి

మిలిటరీ గ్రౌండ్‌లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ పాపం ఎరుగని చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి యత్నించారు.

మెహిదీపట్నం మిలిటరీ  గ్రౌండ్‌లో ఘాతుకం
ఆర్మీ వ్యక్తులే చేశారని బాలుడి వాంగ్మూలం
తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం

 
హైదరాబాద్: మిలిటరీ గ్రౌండ్‌లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ పాపం ఎరుగని చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి యత్నించారు. ఈ దారుణం బుధవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మిలిటరీ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్‌లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముస్తఫా 92 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.


స్టేట్‌మెంట్ రికార్డు చేసిన మేజిస్ట్రేట్...

ముస్తఫా స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తన కుమారుడు వాంగ్మూలమిచ్చాడని తండ్రి షేక్ ముఖీదుద్దీన్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుమాయున్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలుడు పేర్కొనడంతో సిద్దిఖీనగర్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement