సిట్‌ అదుపులో ‘జైషే’ ఉగ్రవాది రెహ్మాన్‌

సిట్‌ అదుపులో ‘జైషే’ ఉగ్రవాది రెహ్మాన్‌ - Sakshi


బీజేపీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర కేసులో వాంటెడ్‌



సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రవాది జకీ ఉర్‌ రెహ్మాన్‌ను సీసీఎస్‌ అధీనంలోని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న రెహ్మాన్‌ తిరిగి వచ్చి పోలీసులకు చిక్కాడు. ఇతడిని విచారిస్తున్న పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.



దుబాయ్‌ నుంచే కుట్ర...

పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లో పని చేస్తున్న జైషే మహ్మద్‌కు మౌలానా మసూద్‌ అజహర్‌ నేతృత్వం వహిస్తున్నాడు. సైదాబాద్‌లోని కూర్మగూడ కి చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, ఇతడి సమీప బంధువు జకీ ఉర్‌ రెహ్మాన్‌లతో పాటు మూసారాంబాగ్‌కు చెందిన షాహెద్‌ అలియాస్‌ బిలాల్‌ తదితరులు ఉగ్రవాదబాట పట్టిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దుబాయ్‌ చేరారు. లష్కరే తొయిబా ద్వారా జైషే మహ్మద్‌లో చేరారు. దుబాయ్‌ నుంచే నగరంలో ఉన్న బీజేపీ నేతలు నల్లు ఇంద్ర సేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరుల్ని హత్య చేయ డానికి 2004లో కుట్ర పన్నారు. ఇందుకు నగరానికి చెందిన నలుగురు, సిద్దిపేటకు చెందిన మరొకరిని రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో నిందితులు జునైద్, రహీమ్, జాహెద్, ఖదీర్, షకీల్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని, చార్జిషీట్లు దాఖలు చేశారు.



ఎట్టకేలకు చిక్కిన జకీ రెహ్మాన్‌

నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారా లు సేకరించడంలో పోలీసులు విఫలం కావడం తో ఐదుగురిపై ఉన్న అభియోగాలను కొన్నేళ్ల క్రితం కోర్టు కొట్టేసింది. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ, జకీ ఉర్‌ రెహ్మాన్, షాహెద్‌ అప్పట్లో బంగ్లాదేశ్, రియాద్, జెడ్డాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కరాచీలో షాహెద్‌ చనిపోగా... షర్హాతుల్లా ఘోరీ ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నాడు. రియాద్‌లో ఉన్న జకీ సమాచారం సేకరించిన నిఘా వర్గాలు... అక్కడి ఏజెన్సీల సాయంతో గురువారం డిపోర్టేషన్‌పై దుబాయ్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి నగరానికి తీసుకొచ్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top