అమెరికా వెళ్లబోయి అబుదాబీలో చిక్కుకుని..

అమెరికా వెళ్లబోయి అబుదాబీలో చిక్కుకుని.. - Sakshi


అబుదాబీ ఎయిర్‌పోర్టులో తెలుగు విద్యార్థుల అవస్థలు

సిలికాన్ వ్యాలీ, ఎన్‌పీయూ విద్యార్థులకు చేదు అనుభవం

పాస్‌పోర్టులు లాగేసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు

దిక్కుతోచక ఎయిర్‌పోర్టులో దిగాలుగా ఉన్న 40 మంది విద్యార్థులు

కనీస సమాచారం ఇవ్వని అధికారులు

సోమవారం రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న వాళ్లేలేరు


 

 (సాక్షి వెబ్ ప్రత్యేకం)

అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని బయలుదేరిన వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గత కొద్దిరోజులుగా కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీల బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న ప్రచారం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

తాజాగా కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 40 మంది విద్యార్థినీ విద్యార్థులను అబుదాబీ ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు 10 మంది విద్యార్థులుండగా, ఆయా రాష్ట్రాల నుంచి బయలుదేరిన విద్యార్థులు మరో 30 మంది వరకు ఉన్నారు.  వీరిలో 10 మంది విద్యార్థులు సోమవారం హైదరాబాద్, ముంబై మీదుగా అబుదాబి చేరుకున్నారు. వారంతా అబుదాబి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లయిట్‌కు బయలుదేరాలి. హైదరాబాద్ నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.
 

పాస్‌పోర్టులు లాగేసుకున్న అధికారులు

ఎతిహాద్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానంలో బయలుదేరిన వీరిని అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లయిట్ విమానం బోర్డింగ్‌కు అనుమతించలేదు. పైగా విద్యార్థినీ విద్యార్థులందరి నుంచి పాస్‌పోర్టులను లాగేసుకున్నారు. అదేమంటే... మాకున్న ఆదేశాల మేరకు మిమ్మల్ని అనుమతించడం లేదన్నారు. అంతకు మించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

 

 ఏం చేయాలో వారికి పాలుపోని పరిస్థితి ఎదురైంది. లాంజ్‌లోంచి ఎక్కడికీ కదలనివ్వలేదు. గంటల తరబడి లాంజ్‌లోనే ఉండిపోయారు. వారికి సరైన సమాచారం ఇచ్చే వాళ్లు కూడా కరవయ్యారు. దాంతో జరిగిన విషయాన్ని ఎవరికి వారు తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు వచ్చి వాళ్లకు ఫుడ్ కూపన్స్ అందజేశారు.
 బుధవారం తిరిగి పంపిస్తాం..

 సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఆ విద్యార్థులకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే మంగళవారం రాత్రి ఒక అధికారి వారి వద్దకొచ్చి బుధవారం ఉదయం ఫ్లయిట్ ఏర్పాటు చేస్తున్నారని, అందరినీ తిరిగి ఇండియాకు పంపిస్తారని చెప్పారు. పాస్‌పోర్టులను మాత్రం వారికి ఇవ్వలేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత తిరిగి మాకు అందజేస్తారని చెబుతున్నారని ఎన్‌పీయూలో ఎంఎస్ అడ్మిషన్ కోసం వెళ్లిన వికాస్ సాక్షితో చెప్పారు.

 

 ఎన్నో ఆశలతో...

 ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో బయలుదేరామని, ఎవరో ఎక్కడో చేసిన తప్పిదానికి మమ్మల్ని బలి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అబుదాబిలో నానా కష్టాలు పడుతున్న వారికి తమ భవిష్యత్తు ఏమిటో అర్థంకాక బాధపడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు రెండు రోజులుగా అబుదాబిలో ఆగిపోతే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

 

 ఏం జరుగుతుందో తెలియక...

 గడిచిన వారం రోజులుగా ఈ యూనిర్సిటీల్లో అడ్మిషన్లకు వెళుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గత వారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట  ఎయిర్ ఇండియా అధికారులు ఉత్సాహం ప్రదర్శించిన మరో 19 మంది విద్యార్థులకు అసలు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచే తిప్పిపంపారు. అదేమంటే... మాకున్న సమాచారం మేరకు మిమ్మల్ని అనుమతించమని, ఒకవేళ అనుమతించినా అమెరికా నుంచి తిరిగి పంపించివేస్తారంటూ ముక్తసరి సమాధానమిచ్చారేగానీ కారణాలను వెల్లడించలేదు.

 

 

 బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదన్న వర్సిటీలు

 ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరిస్తున్న దశలో ఆందోళన చెందిన విద్యార్థులు ఆయా యూనిర్సిటీ అధికారులను సంప్రదించారు. మెయిల్స్ ద్వారా సంప్రదించిన పలువురు విద్యార్థులతో పాటు ఆ రెండు వర్సిటీలు తమ వెబ్‌సైట్‌లో కొన్ని వివరాలిచ్చాయి. తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. అదొక ప్రచారంగా కొట్టిపారేశాయి. ఇమిగ్రేషన్ అధికారులకు వీసా, ఐ20, అడ్మిషన్ ప్యాకేజీ, ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ వంటి సరైన పత్రాలను చూపించాలని, ఎలాంటి సమస్య తలెత్తదని పేర్కొన్నాయి. ఫ్యారిస్‌లో దాడుల ఘటన తదనంతరం భద్రతా చర్యలు ముమ్మరం చేయడంవల్ల సెక్యూరిటీ పరమైన అంశాలే తప్ప ఇతరత్రా ఇబ్బందులు లేవని సమాచారమిచ్చాయి.

 

 అసలేం జరుగుతోంది?

అమెరికాలోని వందలాది యూనివర్సిటీలుండగా వేటికీ తలెత్తని సమస్య వీటికి మాత్రమే ఎందుకు వచ్చిందన్నది ప్రధానాంశం. బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదంటూ ఆ యూనిర్సిటీలు చెబుతున్న దాంట్లో వాస్తవమెంతో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టనప్పుడు కొందరు విద్యార్థులనైనా అనుమతించాలి కదా... అలా కాకుండా ఆ యూనివర్సిటీలకు వెళుతున్న వారందరినీ ఎందుకు తిప్పిపంపిస్తున్నారన్న విషయంపై ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో మాట్లాడినప్పుడు, బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని  చెబుతున్నారు. మాకు ఇటీవలే సెకండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని, బ్లాక్ లిస్ట్‌లో పెడితే పరీక్షలు నిర్వహించడానికి వీలుండదని, అలాంటి పరిస్థితి ఏమీ లేదని ఎన్‌పీయూలో ఎంఎస్ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చెప్పారు. ఈ యూనివర్సిటీల్లో గత సెమిస్టర్ కాలంలో 4500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

 

 

అమెరికాలో సోదాలు

ఇటీవలి ప్యారిస్ దాడుల నేపథ్యంలో కాలిఫోర్నియా అంతటా సోదాలు ముమ్మరం చేసినట్టు అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ప్రధానంగా వర్సిటీల్లో చదువుతూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య విపరీతంగా  పెరిగిపోవడం కూడా సోదాలకు ఒక కారణంగా చెబుతున్నారు.

 

జనవరి తొలివారంలో స్పష్టత...

ప్యారిస్ దాడులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఘనంగా నిర్వహించుకునే క్రిస్‌మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలోనే తనిఖీలు ముమ్మరం చేశారని అంతకు మించిన ఎలాంటి సమస్యలు లేవని అక్కడివారు సమాచారమిచ్చారు.

 

స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకే...

ఈ యూనిర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు గత వారం అమెరికా వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు ఆరుగురు విద్యార్థులను తిప్పిపంపారు. అలా తిప్పిపంపడమే అసలు సమస్యకు ప్రధాన కారణమైందని విశ్లేషిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద అధికారులు అడిగిన ప్రశ్నకు ఒకదానికి మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పిన కారణంగా వారిని తిప్పిపంపినట్టు తెలుస్తోంది. దాని ప్రభావమే మిగతా విద్యార్థులపై పడిందని చెబుతున్నారు.

 

అమెరికా ప్రభుత్వం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన కారణంగా ఎయిర్ ఇండియా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎవరో కొంతమంది విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తితే ఎయిర్ ఇండియా అదికారులు మిగతా విద్యార్థులను ఇబ్బందుల పాలు చేశారని అంటున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అనుమతి నిరాకరిస్తే వారందరినీ తిరిగి తీసుకురావలసి ఉంటుందని, దాన్ని తప్పించుకోవడానికే ఎయిర్ ఇండియా అధికారులు ఈ రకంగా చేశారని కూడా వినిపిస్తోంది.

 

 దుష్ర్పచారం వద్దు...

భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురిచేయరాదని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ నేషనల్ కల్చరల్ చైర్మన్ శ్రీనివాస్ మనప్రగడ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ అప్పిరెడ్డి, యువ సంస్థ ప్రతినిధి సతీష్‌లు అన్నారు. ఆ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న ప్రచారం వల్ల ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని, వారితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతారని చెప్పారు. ఆ రెండు యూనివర్సిటీల్లో ప్రస్తుతం నాలుగు వేల మంది తెలుగు విద్యార్థులున్నారని, తప్పుడు ప్రచారం చేసి వారి భవిష్యత్తును పాడుచేయొద్దని కోరారు. వదంతులను నమ్మొద్దని వారు కోరారు.

 

కొంత మంది తత్తరపాటే

ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత మంది విద్యార్థులు తత్తర పడటం, పొంతన లేని సమాధానాలు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తి ఉంటాయని, అంతమాత్రంగా నిజమైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం కలిగించే ప్రచారం వద్దని ఆయన కోరారు.

 

శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కొంత మంది విద్యార్థులను తిప్పిపంపినప్పుడు ఎయిర్ ఇండియా ఒక్కో విద్యార్థి నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేసిందని మనప్రగడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి నుంచి 1.45 లక్షల రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు 20 మంది విద్యార్థులకు బోర్డింగ్ పాస్ జారీ చేయకుండా వెనక్కి పంపించిందని ఆయన తప్పుబట్టారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top