
'ఏం ఒరుగుతుందన్నవారికి ఇదే మా సమాధానం'
తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం ఒరుగుతుంది అన్న వారికి మేం తగిన సమాధానం ఇస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే నిధుల కొరత ఉండదని ఆనాడే చెప్పామన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం ఒరుగుతుంది అన్న వారికి మేం తగిన సమాధానం ఇస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే నిధుల కొరత ఉండదని ఆనాడే చెప్పామన్నారు. దాని ప్రకారమే ఎన్నికల మ్యానిఫెస్టో కూడా పెట్టామని అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందని చెప్పారు. మన కండ్లముందే వాస్తవాలు కనబడుతున్నాయని, మన వనరులు మన ప్రజలకే ఖర్చు చేసే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రణాళిక పద్దు కింద ఇంత మొత్తంలో ఎప్పుడూ తెలంగాణకు ఖర్చు చేయలేదని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణకు పది వేల కోట్లుకూడా ఖర్చు పెట్టిన సందర్భం లేదని అన్నారు. అభివృద్ధి నిధుల కోసం తెలంగాణ ప్రజలు నిరంతరం నిరీక్షణ చేశారని చెప్పారు. సమైక్య పాలనలో ప్రతీ రూపాయికి తెలంగాణ బిక్షమెత్తుకునే దుస్థితి ఉందన్నారు. కానీ, ఇప్పుడు చరిత్రను తిరగరాసుకుంటున్నామని అన్నారు. కేవలం ప్లాన్ బడ్జెట్ కింద గత ఆర్థిక సంవత్సరం రూ.52,383.20కోట్లు కేటాయించుకోగలిగాం అన్నారు. ఈ సారి కూడా ప్లాన్ బడ్జెట్ కింద చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు పెట్టబోతున్నామని అన్నారు. తెలంగాణ వస్తే ఏం ఒరుగుతుందన్న వారికి ఇదే తమ సమాధానం అని చెప్పారు.