సూడో పోలీస్ హల్‌చల్ | Sakshi
Sakshi News home page

సూడో పోలీస్ హల్‌చల్

Published Thu, Jul 10 2014 7:53 AM

sudo police robbery at secunderabad

  •     సీసీఎస్ పోలీస్‌నంటూ కన్సల్టెన్సీ మహిళలను బెదిరింపు
  •      సెల్‌ఫోన్లు, రూ.20 వేల నగదుతో ఉడాయింపు
  •      సికింద్రాబాద్‌లో ఘటన
  •      ఆలస్యంగా వెలుగులోకి..
  • చిలకలగూడ: సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీస్‌నంటూ ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. ఓ కన్సల్టెన్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. వారి సెల్‌ఫోన్లతోపాటు రూ.20 వేల నగదును తస్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కన్సల్టెన్సీ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    వివరాలు ఇలా..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ కన్సల్టెన్సీ కార్యాలయానికి ఈనెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ ఆగంతకుడు వచ్చాడు. తాను సీసీఎస్ పోలీస్‌నని, కన్సల్టెన్సీ నిర్వహణకు అనుమతి లేదన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటూ హడావిడి చేశాడు. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేస్తున్నానని అక్కడి సిబ్బందికి చెప్పి ఏదో నెంబర్‌కు డయల్ చేసి ఇక్కడ అంతా మహిళలే ఉన్నారు, లేడీ కానిస్టేబుళ్లను పంపమని ఆదేశాలు జారీ చేశాడు.

    ‘మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నా’నంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అందరి వివరాలు కాగితంపై రాసివ్వాలంటూ హుకూం జారీ చేశాడు. మహిళల సెల్‌ఫోన్లను తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత పక్క గదిలోకి వెళ్తున్నానని చెప్పి అక్కడినుంచి జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చిన సిబ్బంది యాజమాన్యానికి, డయల్-100కి ఫోన్ చేసి సమాచారం అందించారు.

    పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోననే భయంతో మహిళా సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇతర ప్రాంతంలోని కన్సల్టెన్సీ యాజమాన్యం వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా ఆగంతకుడు కార్యాలయానికి చెందిన రూ.20 వేలు తస్కరించినట్టు తేలింది. సదరు యజమాని రెండు రోజులు క్రితం ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదు చేయగా గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement
Advertisement