Sakshi News home page

చదివింది బీటెక్... చేసేది చోరీలు

Published Thu, Aug 25 2016 7:00 PM

Robber arrested in HYderabad

చదివింది ఇంజినీరింగ్.. చేసేది సెల్‌ఫోన్ చోరీలు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ తయారు చేస్తానని సాఫ్ట్‌వేర్ సంస్థల నిర్వాహకులను పిలిపించి వాళ్ల సెల్‌ఫోన్లతో ఉడాయిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ నివాసి చేగొండి చంద్రశేఖర్(25) భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ పూర్తి చేశాడు. కొద్ది రోజులు శోభ డెవలపర్స్‌లో సివిల్ ఇంజినీర్‌గా పని చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు సరిపోక సరికొత్త చీటింగ్‌తో చోరీలకు శ్రీకారం చుట్టాడు. తాను ఈ-కామర్స్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తానని నమ్మబలికి సాఫ్ట్‌వేర్ సంస్థల నిర్వాహకులను పిలిపిస్తాడు. ఈ నెల 17న టాంజీనియా టెక్‌సొల్యూషన్స్ అధినేత రవితేజకు ఫోన్లో వల వేశాడు. ఓ రెస్టారెంట్‌కు పిలిచి వెబ్‌సైట్ గురించి మాట్లాడాడు. భోజనం తర్వాత తన ఫోన్ పని చేయడం లేదని, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే కాల్ చేసుకొని ఇచ్చేస్తానని తీసుకున్నాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే విధంగా సునీల్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను జూబ్లీహిల్స్‌లోని సెలబ్రేషన్స్ హోటల్‌లో, మోజం అనే సాఫ్ట్‌వేర్ సంస్థ అధినేతను స్పైసీ అవెన్యూ హోటల్‌లో చంద్రశేఖర్ మోసం చేశాడు. నిందితుడు గతంలో వైజాగ్‌లో కూడా ఇలాగే ల్యాప్‌టాప్‌తో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement