కరువుపై స్పందించాలి | Respond on drought | Sakshi
Sakshi News home page

కరువుపై స్పందించాలి

Apr 24 2016 3:27 AM | Updated on Jul 29 2019 2:51 PM

కరువుపై స్పందించాలి - Sakshi

కరువుపై స్పందించాలి

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు.

♦ రాష్ట్ర ప్రభుత్వానికి కోదండరాం డిమాండ్
♦ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో అన్ని పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై టీ జేఏసీ రూపొందించిన నివేదికను శనివారం హైదరాబాద్‌లోని టీజేఏసీ కార్యాలయంలో కోదండరాం విడుదల చేశారు. త్వరలో తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామన్నారు. ఇటీవల టీజేఏసీ, తెలంగాణ విద్యా వేదిక బృందాలు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమాచారాన్ని సేకరించాయని తెలిపారు. 50, 60 ఏళ్లలో ఇలాంటి కరువును ప్రజలు ఎదుర్కోలేదని వెల్లడైందన్నారు.   

 ఒక్కో జిల్లాలో ఒక్కోలా...
 రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైన కరువు పరిస్థితి ఉందని తమ పరిశీలనలో వెల్లడైందని కోదండరాం చెప్పారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి ‘డ్రాట్ మాన్యువల్’కు అనుగుణంగా కరువు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామం యూనిట్ గా వర్షపాతం వివరాలు నమోదు చేయాలని, వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. సహకార,వాణిజ్య బ్యాంకుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని, గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున ఉపాధి కల్పన పథకాలను రూపొందించి అమ లు చేయాలన్నారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, ఉపాధి కూలీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలన్నారు. గ్రామాల్లో పేదలకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పశుపోషణ రైతులకు భారంగా మారినందున ఉచితంగా గ్రాసం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఈ సబ్సిడీ చెల్లింపులో అవకతవకలు, అవినీతిపై ఆరోపణలు వస్తున్నాయని... పంటల బీమా పేరిట రైతుల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పారు. మద్యం కంపెనీలకు నీటి సరఫరాను నిలిపివేయాలని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు. జూన్ 2ను తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటిస్తామన్నారు. టీజేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ నాయకులు రఘు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement