4 జిల్లాల్లో భారీగా రీ సైక్లింగ్‌ | Sakshi
Sakshi News home page

4 జిల్లాల్లో భారీగా రీ సైక్లింగ్‌

Published Mon, Jan 1 2018 2:20 AM

Recycling heavily in 4 Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గొర్రెల పంపిణీ’కి సంబంధించి నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ముగ్గురు అధికారులతో అంతర్గత విచారణ కమిటీని నియమించింది. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరిగిన గొర్రెల కొనుగోళ్లపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. అలాగే గొర్రెల పంపిణీ పథకం ఆడిటింగ్‌ బాధ్యతలను సెస్‌ (సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌)కు అప్పగించింది. గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 1,67,000 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది.

దాదాపు 35 లక్షల గొర్రెలు పంపిణీ చేయగా.. వాటికి 12 లక్షలు గొర్రె పిల్లలు పుట్టినట్లు అంచనా వేసింది. అయితే నవంబర్‌ 15 తర్వాత నెల రోజులు నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ జరిగింది. దీంతో ఆ 4 జిల్లాల్లో రీసైక్లింగ్‌ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. శాఖాపరమైన విచారణ కొనసాగిస్తోంది. అలాగే సంబంధిత జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో పంపిణీ చేసిన అన్ని యూనిట్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. 

సెస్‌కు ఆడిటింగ్, సర్వే
మహబూబ్‌నగర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న వందలాది గొర్రెలు ఇటీవల పట్టుబడ్డాయి. వివిధ జిల్లాల్లో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు అధికారులనూ సస్పెండ్‌ చేశారు. దీంతో రీ సైక్లింగ్‌ జరగకుండా చెవులు కత్తిరించిన గొర్రెలు కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా థర్డ్‌ పార్టీ సర్వే చేపట్టాలని నిర్ణయించారు.శాస్త్రీయ పద్ధతిలో 10 శాతం రాండమ్‌ శాంపిల్‌తో సర్వే చేసే బాధ్యతను సెస్‌కు అప్పగించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement