అభివృద్ధిలో గుణాత్మక మార్పు

Qualitative change in development - Sakshi

బడ్జెట్‌పై చర్చలో ఆర్థిక మంత్రి ఈటల

మార్వాడీ కొట్టులా ఆలోచించం

పేదల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం

త్వరలోనే బీసీలకు పథకాలు

27 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణ సొంతంగా నిలబడింది. అభివృద్ధిలో గుణాత్మక మార్పు సాధించింది’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పేదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఎంత అవసరమైనా ఖర్చు చేస్తుందని, మార్వాడీ కొట్టులా ఆలోచించదని పేర్కొన్నారు. రజకులు, నాయిబ్రాహ్మణులు, విశ్వకర్మలు, ఇతర బీసీ, ఓబీసీ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే కొత్త పథకాలు ప్రకటిస్తారని వెల్లడించారు.

బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల హృదయాలను గెలుచుకుందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి సహా అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. మానవతా విలువలతో పేద వాళ్ల కడుపును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే అండగా నిలుస్తోందని, రూ.5 లక్షల బీమా అమలు చేస్తోందని చెప్పారు. ప్రమాదాల్లో మరణించే గొల్ల, కురుమలకు, ముదిరాజ్, బెస్తలకు, కల్లు గీత కార్మికులకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ‘కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. నాది తెలంగాణ అని గల్లా ఎగరేసి చెబుతున్నాం. అభివృద్ధిలో గుణాత్మక మార్పు సాధించాం’అని పేర్కొన్నారు.

కారం, చింతపండు ఎవరూ తీసుకోవట్లేదు
తెల్ల రేషన్‌ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న ఆహారభద్రత చట్టంతో రాష్ట్రంలోని 1.91 కోట్ల మంది పేదలకు ఒకరికి 5 కిలోల చొప్పున రూ.3కు కిలో చొప్పున బియ్యం ఇస్తోందని చెప్పారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందడుగు వేసి 2.74 కోట్ల మంది పేదలకు రూపాయికి కిలో చొప్పున ఒకరికి 6 కిలోల బియ్యాన్ని ఇస్తోందని చెప్పారు. పసుపు, కారం, చింతపండును ఎవరూ తీసుకోవట్లేదని పేర్కొన్నారు. చక్కెర, వంటనూనెను కేంద్రం నిలిపేసిందని, స్థానికంగా కందుల లభ్యత ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కంది పప్పు సరఫరాను ఆపేసిందని చెప్పారు.

పారిశ్రామిక పురోగతి
కరెంటు లేక కార్మికులు, పరిశ్రమల యజమానులు గతంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిరంతర కరెంటు సరఫరా, ప్రోత్సాహకాలు వంటి నిర్ణయాలతో పారిశ్రామిక రంగంలో అద్భుత పురోగతి నమోదవుతోందని చెప్పారు. పేద విద్యార్థుల కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో మెస్‌ చార్జీలను పెంచినట్లు చెప్పారు. లక్ష ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 27,588 పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాదిలో మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.

బడ్జెట్‌ పుస్తకాలు ముద్రించాక పిలిచారు
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధ్యమవుతుందని ఈట ల అన్నారు. కేంద్ర బడ్జెట్‌ పుస్తకాల ము ద్రణ పూర్తయ్యాక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించి, అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని కోరారని చెప్పారు. రూ.40 వేల కోట్లతో తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేంద్రం ఇవ్వాల్సిన రూ.10 వేల కోట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచిన సీఎం కేసీఆర్‌ను భోళాశంకరుడు అని జి.కిషన్‌రెడ్డి ప్రశంసిచినట్లు పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top