ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది.
హైదరాబాద్: ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. పుణే విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, సాంకేతిక లోపం తలెత్తడంతో హైదరాబాద్ నుంచి పుణే వెళ్లే ఎయిర్ ఇండియాకు అనుబంధంగా నడిచే అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం రద్దయింది.
గోవా నుంచి హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో బయల్దేరేముందు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 50మంది ప్రయాణికులున్నారు. వీరిని ఆదివారం ఉదయం మరో ఎయిర్‌లైన్స్ విమానంలో పుణే పంపినట్లు ఎయిర్ ఇండియా–అలయన్స్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు వివరించారు.