విద్యుత్‌ వాహనాలదే భవిష్యత్‌!

Prabhakar Rao about Electricity companies - Sakshi

2030 నాటికి ప్రజారవాణాలో 100 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలే

ఎస్సార్‌పీసీ భేటీలో ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో విద్యుత్‌ వాహనాల పరిశ్రమ పురోగతిలో ఉందని, దీనికి తగ్గట్లుగా విద్యుత్‌ సంస్థలు సంసిద్ధం కావాలని దక్షిణాది విద్యుత్‌ సంస్థల సంఘం(ఎస్సార్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. పాండిచ్చేరిలో శనివారం జరిగిన ఎస్సార్‌పీసీ 33వ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల అధి పతులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సమస్యలు, ఇతర అంశాలపై ప్రభాకర్‌రావు స్పందించారు.

కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణహిత వాహనాల వాడకాన్ని అన్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, భారత్‌లో కూడా విద్యుత్‌ వాహనాల పరిశ్రమ  అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 2030 నాటికి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలో నూరు శాతం, వ్యక్తిగతస్థాయిలో 40 శాతం విద్యుత్‌ వాహనాల వినియో గం ఉండాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. పెట్రోల్‌ పంపుల మాదిరిగా వాహనాలకు విద్యుత్‌ చార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉందన్నారు.

విద్యుత్‌ సంస్థలు సంసిద్ధం కావాలని, చార్జింగ్‌ స్టేషన్లకు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆయా రాష్ట్రాల విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్లతో సంప్రదించి, విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ చేసే ఏజెన్సీలను ప్రత్యేక విద్యుత్‌ వినియోగదారులుగా గుర్తించాలని, వారికి ప్రత్యేక టారిఫ్‌ నిర్ణయించాలన్నారు. విద్యుత్‌ రంగంలో సైబర్‌ భద్రతకు సంబంధించి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ అప్రమత్తంగా ఉందని, విద్యుత్‌ సంస్థలకు సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.

24 గంటల విద్యుత్‌పై ఎస్సార్పీసీ హర్షం  
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయడంపై ఎస్సార్‌పీసీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. విద్యుత్‌ రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తంగపాండ్యన్‌ కొనియాడారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, పాండిచ్చేరి, రైల్వేస్, కోల్‌ ఇండియా, పీజీసీఎల్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా అభినందనలు తెలిపారు. సమావేశంలో ఎస్సార్‌పీసీ సభ్యకార్యదర్శి ఎస్‌ఆర్‌ భట్, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి విద్యుత్‌ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, రైల్వేస్, కోల్‌ ఇండియా, పీజీసీఎల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top