చీకట్లో 18 గంటలు.. | Placed in several power supply | Sakshi
Sakshi News home page

చీకట్లో 18 గంటలు..

May 8 2015 2:35 AM | Updated on Sep 22 2018 7:53 PM

చీకట్లో  18 గంటలు.. - Sakshi

చీకట్లో 18 గంటలు..

నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి చీకట్లు అలుముకున్నాయి. దాదాపు 18 గంటలపాటు బస్తీల వాసులు అంధకారంలో ఉండిపోయారు.

ఈదురు గాలులు, వర్షంతో
పలుప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
150 ఫీడర్లు ట్రిప్పు,దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు
పలు బస్తీల్లో కరెంట్ కట్

 
నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి చీకట్లు అలుముకున్నాయి. దాదాపు 18 గంటలపాటు బస్తీల వాసులు అంధకారంలో ఉండిపోయారు. బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో 150 ఫీడర్లు ట్రిప్పు కాగా, 60కిపైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కాంట్రాక్టు కార్మికులంతా సమ్మె చేస్తుండటంతో లైన్లను పునరుద్ధరించే వారు కరువయ్యారు. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో ఉక్కపోత, దోమల మోతతో బస్తీవాసులు రాత్రంతా నరకం చవిచూశారు. - సాక్షి, సిటీబ్యూరో
 
ఎండ ముదిరినా...గాలివీచినా...వర్షం కురిసినా...ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. తీగలు తెగి పడుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. ఏటా ఇదే తంతు! ఏటా రూ.కోట్లు ఖర్చు చేసి లైన్లను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పు తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలలతో కురిసిన వర్షానికి నగరం లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. చెట్లకొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో రంగారెడ్డి నార్త్ పరిధిలోని హబ్సిగూడ, చర్లపల్లి, సాకేత్, సీఆర్‌పీఎఫ్‌తో పాటు రంగారెడ్డి సౌత్ జోన్ పరిధిలోని రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని చిలకలగూడ, మలక్‌పేట్, హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని కళ్యాణ్‌నగర్, ఎంఎల్‌ఏ కాలనీ, మోండామార్కెట్,  హైదారాబాద్ సె ంట్రల్ జోన్ పరిధిలోని ఆసీఫ్‌నగర్‌లోని సుమారు 150 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. 60కిపైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా బస్తీలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల రాత్రి పది గంటల వరకు సరఫరాను పునరుద్ధరించి నప్పటికీ..సీఆర్‌పీఎఫ్ పరిధిలోని బాలాజినగర్‌లో ఓ పెద్ద వృక్షం విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో భారీ నష్టం వాటిల్లింది. ఫలి తంగా సీఆర్‌పీఎప్ సహా హబ్సిగూడ వీధి నెంబర్ 1,2,3,4లతో పాటు చర్లపల్లి, సాకేత్ సబ్‌స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహించే సెంట్రల్ బ్రేక్‌డౌన్స్ విభాగ ంలోని కాంట్రాక్ట్ కార్మికులంతా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ గత పదకొండు రోజుల నుంచి సమ్మె చేస్తుండడంతో మరమ్మతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

డిస్కం వద్ద సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక పోవడంతో ఫీడర్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు అటు నుంచి వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసే వ్యవస్థలో సాంకేతిక లోపాలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు 1912 సర్వీసు నెంబర్‌ను ఏర్పాటు చేశారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు.

స్థానిక లైన్‌మెన్లకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ సిబ్బందికి ఫోన్ చేస్తే, ఏ ఒక్కరూ కూడా ఫోన్ ఎత్తక పోవడంతో విద్యుత్ ఇంజనీర్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాతంత్రా కరెంట్ లేక పోవడంతో డిఫెన్స్ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రజలు వాజ్‌పేయినగర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి పెద్దఎత్తున్న ఆందోళన చేపట్టారు. సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు.

కార్మికుల కోసం పోరాటం
 
నేరుగా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్‌పీడీసీ ఎల్, ఎన్‌ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని కార్మికులంతా కార్మికులు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేప ట్టి ఆరు రోజులైంది. అయినా యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడటం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 18000 మం ది కార్మికులు సమ్మె చేస్తుండగా, వీరిలో ఒక్క గ్రేటర్‌లోనే 9600 మంది ఉన్నారు. యాజమాన్యం దిగివచ్చి కార్మికులకు న్యాయం చేసే వరకు చేపట్టిన సమ్మెను, ఆమరణ నిరాహార దీక్షను విరమించే ప్రసక్తే లేదు.
 - సాయిలు,  కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జేఏసీ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement