
రెండో శనివారం బంద్ చేసినా సక్సెస్ కాలేదు..
విపక్షాలు రెండో శనివారం బంద్కు పిలుపునిచ్చినా విజయవంతం కాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : విపక్షాలు రెండో శనివారం బంద్కు పిలుపునిచ్చినా విజయవంతం కాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. బంద్కు ప్రయత్నించిన చోట ప్రజలే తిరగబడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ...అలాగే ఏకకాలంగా రుణాలు మాఫీ చేయాలంటూ విపక్షాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఇకనైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
రేస్ కోర్స్పై వాణిజ్య పన్నులశాఖ దాడులు జరిపిందని తలసాని తెలిపారు. రేస్ కోర్స్ స్థలంపై కొన్ని అవకతవకలు బయటపడ్డాయని, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే యోచనలో ఉందని ఆయన పేర్కొన్నారు. రేస్ కోర్సు ప్రాంతంలో ఐటీ పార్క్, సైబర్ టవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.