'అద్దె అడిగితే చీరేస్తా..' | Sakshi
Sakshi News home page

'అద్దె అడిగితే చీరేస్తా..'

Published Thu, Nov 26 2015 6:04 PM

Man threatens old woman

బంజారాహిల్స్ : ఇంటి అద్దె అడిగితే చీరేస్తానంటూ వృద్ధురాలిని బెదిరించిన కాంగ్రెస్ నేతపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12  లోని ఎన్బీటీనగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రధాన అనుచరుడు పి.తిరుమలేష్ నాయుడు ఎమ్మెల్యే కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ ప్రిన్సిపల్ కె.దాక్షాయని (61)కి చెందిన ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. నెలకు రూ.11 వేల అద్దె చెల్లిస్తానని చెప్పి 2013 నవంబర్ నుంచి ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అద్దెకు దిగిన సమయంలో రెండు నెలల అడ్వాన్స్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోగా.. అప్పటి నుంచి అద్దె కూడా చెల్లించడం లేదు.

పలుమార్లు అద్దె కోసం అడగ్గా ఇటీవల రూ.50 వేలు మాత్రం బ్యాంకు అకౌంట్‌లో వేశాడని.. మిగతా డబ్బుల కోసం అడిగితే 'అద్దె ఇవ్వను, ఫ్లాట్ ఖాళీ చేయను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..' అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని దాక్షాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న అద్దె డబ్బులు అడిగేందుకు మరోసారి వెళ్లగా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అద్దె అడిగితే చీరేస్తానంటూ హెచ్చరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తిరుమలేష్ నాయుడుపై ఐపీసీ సెక్షన్ 509, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement