రూ. కోటి కేబుళ్లు బుగ్గిపాలు

రూ. కోటి కేబుళ్లు బుగ్గిపాలు - Sakshi


జీటీఎస్‌కాలనీ సబ్‌స్టేషన్‌లో ఘటన

 

వెంగళరావునగర్: జీటీఎస్‌కాలనీ 132 కేవీ సబ్‌స్టేషన్ ప్రాంగణంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగి దాదాపు కోటి రూపాయల ఆస్తినష్టం జరిగింది.  వివరాలు...సోమవారం సాయంత్రం దాదాపు 4.30కి సబ్‌స్టేషన్‌లో ఉన్న కాపర్ కేబుల్ బండిల్స్ (అండర్‌గ్రౌండ్ కేబుల్స్) నుంచి పొగ వచ్చింది. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొనేలోపే పెద్ద ఎత్తున మంటలు లేచాయి. అదే ప్రాంగణంలోని ఓ అండ్ ఎం డివిజన్ (రూరల్) చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు యువకులు అగ్ని నియంత్రణ పరికరాలు తెచ్చి మంటలార్పేందుకు యత్నించారు. అయితే చూస్తుండగానే దా దాపు 50 అడుగుల ఎత్తులో అగ్ని కీలల ఎగసిపడటంతో భయంతో వారు అక్కడి నుంచి పరుగు తీశారు.  5.30కి  సనత్‌నగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తచ్చేందుకు అరగంటకు పైగా శ్రమించినా ఫలితం కనిపించలేదు. దీంతో నాలుగు వాటర్‌ట్యాంక్‌లుతో పాటు మరో ఫైర్ ఇంజిన్‌ను రప్పించారు. అతికష్టం మీద ఎట్టకేలకు రాత్రి 7.30కి మంటలను అదుపులోకి తెచ్చారు.



చైనా నుంచి తెప్పించారు...



చైనా నుంచి ఏడాది క్రితం పెద్ద సంఖ్యలో 220 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ బండిల్స్ దిగుమతి అయ్యాయి. ఒక్కో బండిల్‌లో 600 మీటర్ల కాపర్‌వైర్ (220 కేవీ) ఉంటుంది.  వీటిలో కొన్నింటిని నగరంలోని పలు ప్రాంతాల్లో వేసిన కేబుల్స్‌కు వినియోగించారు. వాటిని వినియోగించగా మిగిలిన బండిల్స్ 12 వరకు కార్యాలయం ప్రాంగణంలో నిల్వ ఉంచారు. అగ్నిప్రమాదంలో ఇవి తగలబడ్డాయి. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.



ఇంకా తెలియని కారణం...



అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి వచ్చిన ట్రాన్స్‌కో డెరైక్టర్ జగత్‌రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా... ఎంతనష్టం వచ్చిందనే విషయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని, విచారించి త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, ఓ అండ్ ఎం డీఈలు జగన్‌మోహన్‌రావు, ఎం.బాలాజీతో పాటు పలువురు ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పరిశీలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top