ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ | Sakshi
Sakshi News home page

ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌

Published Fri, Jan 12 2018 1:15 AM

Justice Radhakrishnan as cj to a joint High Court - Sakshi

     ►    కేబినెట్‌ ఆమోదించగానే రాష్ట్రపతి ఉత్తర్వులు
     ►    ఇక్కడే కొనసాగనున్న ఏసీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌
     ►    ఏపీకి హైకోర్టు ఏర్పాటయ్యాక సీజేగా వెళ్లే అవకాశం
     ►    సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్‌ జోసెఫ్, ఇందు మల్హోత్రా?


సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తొట్టతిల్‌ బి.నాయర్‌ రాధాకృష్ణన్‌ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై పలు నియామకాలకు ఆమోదముద్ర వేసింది.

సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులతో పాటు పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలను ఆమోదిస్తూ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటిలో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కేంద్రం ఆమోదముద్ర అనంతరం కొలీజియం సిఫార్సులు రాష్ట్రపతికి చేరతాయి. అనంతరం రాష్ట్రపతి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ దాదాపు ఏడాదిన్నరగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

జస్టిస్‌ రాధాకృష్ణన్‌ సీజేగా రానున్న నేపథ్యంలో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారని తెలిసింది. హైకోర్టు విభజన పూర్తయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది. అప్పటిదాకా ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్‌ జోసెఫ్‌ను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ 2016లోనే సుప్రీం కొలీజియం సిఫార్సు చేసినా పలు రాజకీయ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. 

మరోవైపు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాల్సిందిగా కొలీజియం సిఫార్సు చేసింది. ఇందు పేరుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే మహిళా న్యాయవాదుల కోటా నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. వీరితో పాటు కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి భట్టాచార్యను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి అభిలాష కుమారిని మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆంటోనీ డామినిక్‌ను అదే హైకోర్టు సీజేగా సిఫార్సు చేసింది. 

జస్టిస్‌ రాధాకృష్ణన్‌ బయోడేటా 

జస్టిస్‌ తొట్టతిల్‌ బి.నాయర్‌ రాధాకృష్ణన్‌ 1959 ఏప్రిల్‌ 29న కేరళలో జన్మించారు. తండ్రి ఎన్‌.భాస్కరన్‌ నాయర్, తల్లి కె.పారుకుట్టి ఇద్దరూ న్యాయవాదులే. రాధాకృష్ణన్‌ కొల్లంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. కేరళ వర్సిటీ నుంచి బీఎస్సీ, బెంగళూరు వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్‌లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో దిట్టగా పేరు సంపాదించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండుసార్లు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 2017 నుంచి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.  

Advertisement
Advertisement