సమగ్ర కుటుంబసర్వేకు గ్రేటర్ నగరం సిద్ధమైంది. సర్వేలో భాగంగా వివరాలందించేందుకు నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబసర్వేకు గ్రేటర్ నగరం సిద్ధమైంది. సర్వేలో భాగంగా వివరాలందించేందుకు నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆది, సోమ వారాల్లో ప్రీ విజిట్ నిర్వహించిన ఎన్యూమరేటర్లు అందుబాటులోఉంచుకోవాల్సిన సమాచారం గురించి వివరించారు. నగర విస్తీర్ణం.. చిరునామాల్లో ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో రెండు రోజుల ప్రీ విజిట్ నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు. విజిట్ చేసినట్లు స్టిక్కర్లు అంటించారు. అయినప్పటికీ.. తమ ఇంటికి రాలేదంటూ చాలా మంది నుంచి ఫిర్యాదుల పరంపర. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంట ర్‌కూ విరామం లేకుండా ఫిర్యాదుల వెల్లువ.. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల విజిట్స్ అనుభవంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని.. సర్వేకు సంసిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
ఏర్పాట్లు ఇవీ..
ఉదయం 7 గంటల నుంచి మొదలు. పూర్తయ్యేంతరవకు కొనసాగింపు
మంగళవారం సర్వేలో పాల్గొననున్నవారు
1. నోడల్ ఆఫీసర్లు 172
2. క్లస్టర్ ఇన్‌చార్జులు 1500
3. ఎన్యూమరేటర్లు 20,000
4. అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు 42,000
వీరికి పైస్థాయిలో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, స్పెషల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. కమిషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తారు.
ఒక్కో ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్లు.. అవసరాన్నిబట్టి అదనపు అసిస్టెంట్లను నియమించుకునేందుకు ఆదేశం.
ఆదివారం తొలి విజిట్‌లో కరపత్రాలందించిన ఇళ్లు 13.40 లక్షలు.
నేటి సర్వేకు 21 లక్షల ఇళ్లకు సరిపడా సామాగ్రి అందజేత
జీహెచ్‌ఎంసీతో సహా 40 విభాగాలకు చెందిన వారు విధుల్లో పాల్గొంటున్నారు.
ఎన్యూమరేటర్లు విజిట్‌కు రాలేదంటూ ఆది,సోమవారాల్లో జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు అందిన ఫిర్యాదులు 10,392(రాత్రి 8.40 గంటలవరకు)
ఇంకా..ఎన్యూమరేటర్లు రానివారు ఫిర్యాదు చేయాల్సిన జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040- 21 11 11 11