ఎన్నికలలోపు జర్నలిస్టులకు తీపి కబురు

Good news to  journalists before elections - Sakshi

ఇళ్ల స్థలాలివ్వడానికి సీఎం కేసీఆర్‌ సానుకూలం

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధుల సభలో అల్లం నారాయణ

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరుతామని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌–143) రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలోపే జర్నలిస్టులకు తీపికబురు అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ కూడా సానుకూలంగా ఉన్నారన్నారు.

ఆదివారం ఇక్కడ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ క్రాంతికిరణ్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక జర్నలిస్టులకు ఏమీ ఒనగూరలేదని ఇతర యూనియన్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేద న్నారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్లు ఉన్న 17 వేల మందికిపైగా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, రూ.40 కోట్ల వరకు సంక్షేమ నిధి సాధించామని చెప్పారు. హెల్త్‌కార్డుల ద్వారా వచ్చే మొత్తం సరిపోకపోతే సీఎం వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి జర్నలిస్టుల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నామన్నారు.

మహిళా, డెస్క్‌ జర్నలిస్టులు, చిన్నపత్రికల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పలు తీర్మానాలను సభ ఆమోదించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల యూనియన్‌ (టెమ్జూ) రాష్ట్ర అధ్యక్షుడిగా సయ్యద్‌ ఇస్మాయిల్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.రమణకుమార్, డిప్యూటీ ప్రధానకార్యదర్శిగా టి.యుగంధర్‌ను నియమించారు. సభలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్‌తోపాటు అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top