విమానాల్లో వచ్చి ఏటీఎంలలో చోరీలు.. | Gang of ATM thieves busted | Sakshi
Sakshi News home page

విమానాల్లో వచ్చి ఏటీఎంలలో చోరీలు..

May 10 2016 4:08 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఢిల్లీ కేంద్రంగా ముఠాగా ఏర్పడి విమానాల్లో హైదరాబాద్‌కు వస్తూ... ఇక్కడి వ్యక్తి సహాయంతో ఏటీఎం సెంటర్లు కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠాను హబీబ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు.

- ఏటీఎం కేంద్రాలను టార్గెట్ చేసిన ముఠా
- ఢిల్లీ నుంచి విమానాల్లో వస్తూ ఇక్కడ నేరాలు
- ఐదుగురిని అరెస్టు చేసిన సిటీ పోలీసులు


హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా ముఠాగా ఏర్పడి విమానాల్లో హైదరాబాద్‌కు వస్తూ... ఇక్కడి వ్యక్తి సహాయంతో ఏటీఎం సెంటర్లు కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠాను హబీబ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌లో స్థానికుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మంగళవారం వెల్లడించారు. వీళ్లు రెండు నెలల కాలంలో రూ.4.32 లక్షల మేర మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, బయటపడనివి ఇంతకు భారీగానే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

న్యూ ఢిల్లీకి చెందిన, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న బిపిన్, సయ్యద్ అజారుద్దీన్, షేక్ అషద్ అలీ, ఇంతికాబ్ ఆలం, మహ్మద్ షాబాజ్ ఖాన్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిత్యం విమానాల్లో ఢిల్లీ నుంచి వస్తూ సిటీలో ఉన్న ఐదు బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నారు. సెక్యూరిటీగార్డులు లేని, ఒకే కేంద్రంలో రెండు మిషన్లు ఉన్న వాటిల్లోనే పంజా విసురుతున్నారు. ఐదుగురూ కలిసి వాటి దగ్గరకు వెళ్లి... ముగ్గురు బయట కాపుకాయగా, ఇద్దరు లోపలకు వెళ్తారు.

మొదటి పంథాలో చిప్ మాదిరిగా ఉండే ప్లాస్టిక్ ముక్కను వినియోగించి ఏటీఎం మిషన్ పని చేయకుండా చేసి వినియోగదారులు కార్డు పెట్టి తీసేదాకా వేచి చూస్తారు. ఆపై సదరు మిషన్ పని చేయట్లేదని చెప్పి పక్కనే ఉన్న మిషన్ వినియోగించమంటారు. ఆ సమయంలో వారి పిన్ నెంబర్ తెలుసుకుంటారు. దీని ఆధారంగా మొదటి మిషన్‌ను వినియోగించి డబ్బు డ్రా చేస్తున్నారు.

ఇక రెండో పంథాగా నిరక్షరాస్యులు, వృద్ధులతో పాటు ఏటీఎం వినియోగం తెలియని వాళ్లను ఎంచుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాస్తూ అలాంటి వారికి సహాయం చేస్తున్నట్లు నటించి పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బు డ్రా చేసి ఇస్తున్నారు. ఏటీఎం కార్డు తిరిగి ఇచ్చే సమయంలో దాన్ని మార్చేసి డూప్లికేట్ కార్డు అంటగడుతున్నారు. ఆపై సదరు కార్డు, తెలుసుకున్న పిన్ నెంబర్ సాయంతో డబ్బు డ్రా చేస్తున్నారు. ఈ రెండు పంథాల్లో పశ్చిమ మండల పరిధిలోని హబీబ్‌నగర్, ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌నగర్‌ల్లో ఏడు నేరాలు చేసినట్లు రికార్డుల్లోకి ఎక్కాయి. పోలీసుల దృష్టికి రాకుండా రూ.10 వేల కంటే తక్కువ మొత్తాలు తస్కరించినవి దీనికి రెండు రెట్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు.

వీరి కదలికలపై సమాచారం అందుకున్న హబీబ్‌ నగర్ పోలీసులు మంగళవారం తాడ్‌బండ్ చౌరస్తాలోని ఏటీఎం కేంద్రం వద్ద వీరిని పట్టుకున్నారు. బిపిన్ పరారు కాగా... మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, సెల్‌ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.గోషామహల్ ఏసీపీ కె.రామ్‌భూపాల్‌రావు, హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్, డీఐలు ఆర్.సంజయ్‌కుమార్, ఎం.సుమన్‌కుమార్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement