సాజిదా... సౌండ్‌ ఆఫ్‌ సక్సెస్‌

first indian music technician sajida khan special interview - Sakshi

సౌండ్‌ఇంజినీరింగ్‌లో రాణిస్తున్న నగర యువతి సాజిదాఖాన్‌

భారత తొలి మహిళా మ్యూజిక్‌ టెక్నీషియన్‌గా గుర్తింపు 

కేంద్రం నుంచి ఫస్ట్‌ లేడీ పురస్కారం  

ఆమె విజయం శబ్దం చేస్తుంది. నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతుంది. మరెందరికో వీనులవిందు చేçస్తుంది. స్ఫూర్తి రాగంవినిపిస్తుంది. నగర యువతి సాజిదాఖాన్‌... తనను తాను నిరూపించుకోవడానికి ఒక వైవిధ్యభరితమైన రంగాన్నిఎంచుకున్నారు. సృజనకు సానబెట్టి, భారత తొలి మహిళా మ్యూజిక్‌ టెక్నీషియన్‌గా నిలిచారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫస్ట్‌ లేడీ’ పురస్కారాన్ని అందుకున్నారు. 

‘సంగీతం, శబ్దం
రెండూ నన్ను నడిపించే చోదకశక్తులు’ అంటారు ఈసీఐఎల్‌లో నివసించే సాజిదాఖాన్‌. సిటీజనులకు పెద్దగా పరిచయం లేని ఈ అమ్మాయి... నగర ప్రముఖులైన పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జా
తదితరులతో పాటు మిస్‌సైల్‌ లేడీ ఆఫ్‌ ఇండియా టెస్సీ థామస్‌ లాంటి వారితో కలిసి ఫస్ట్‌ లేడీ అవార్డు అందుకున్నారు.  

ఆసక్తి శక్తిగా మారింది..  
సాజిదాఖాన్‌ మల్టీమీడియా కోర్సుతో పాటు ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. చిన్నతనం నుంచే ఇష్టమైన మ్యూజిక్‌ను తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. ‘నాన్న రైల్వే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. ఆయనకు కళలంటే ఆసక్తి. హవాయిన్‌ గిటార్‌ ప్లే చేస్తారు. అలాగే పెయింటింగ్స్‌ బాగా వేస్తారు. ఆయన అభిరుచులే నాకు అబ్బాయేమో... స్కూల్‌ ఫంక్షన్లలో పాడడం, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్లే చేయడం చేసేదాన్ని. ఆ అభిరుచి నాతో పాటు పెరిగి పెద్దయింది. యానిమేషన్‌ కోర్సు చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక అంకుల్‌కి తెలిసిన మ్యూజిక్‌ స్టూడియోకి వెళ్లాను. అక్కడి టెక్నాలజీ, రికార్డింగ్‌ ఎడిటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ తదితర నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక రోజూ ఆ స్టూడియోకి వెళ్తుండేదాన్ని. అలా సౌండ్‌ ఇంజినీరింగ్‌లో బేసిక్స్‌ నేర్చుకున్నాను. ఇంటర్నెట్‌లో మెటీరియల్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని స్టడీ చేశాను. కొంత అనుభవం వచ్చాక  సొంతంగా టెక్నికల్‌ వర్క్‌ ప్రారంభించాను. ఆ సమయంలో సన్నిహితుల ద్వారా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లలిత్‌ సురేష్‌ స్టూడియోలో చేరి, కొంతకాలం పనిచేశాను. అక్కడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నా నైపుణ్యానికి మరింత సానబెట్టింద’ని చెప్పారు సాజిదా.  

ప్రయాణానికి పదేళ్లు...   
దాదాపు 10ఏళ్ల ఆడియో ఇంజనీర్‌ అనుభవం సాజిదాది.  జాతీయ పురస్కారాలు పొందిన అడవి నా తల్లిరో వంటి సినిమాలకు పనిచేశారు. విభిన్న అంశాల్లో ప్రతిభ ప్రదర్శించే సాజిదా...గాయనిగా కూడా  జాతీయ పురస్కారం దక్కించుకుని, పియానో పలికించడంలోనూ తనదైన ముద్ర వేశారు. ‘‘ఒక ప్రొఫెషనల్‌ ఆడియో ఇంజనీర్‌గా, సినిమా డబ్బింగ్, సౌండ్‌ ఎఫెక్ట్స్, బ్యాగ్రవుండ్‌ మ్యూజిక్, తెలుగు, తమిళ, మళయాళ భాషా చిత్రాలకు కంప్లీట్‌ ఆడియో మిక్స్‌... చేయగలను. జింగిల్స్, టెలి సీరియల్స్, డాక్యుమెంట్రీస్, రికార్డింగ్స్, టివి, యాడ్‌ ఫిల్మŠస్‌కు కూడా వర్క్‌ చేశాను’’ అంటూ చెప్పారామె.  

 సవాళ్లున్నా భవిష్యత్తు మిన్న...  
‘ఈ రంగం చాలెంజింగ్‌గా ఉంటుంది. అయినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు, కెరీర్‌ అందిస్తుంది. ఆడియో ఇంజనీరింగ్‌ అంటే సైన్స్‌ మాత్రమే కాదు.. ఆర్ట్‌ కూడా. మైక్రోఫోన్లతో సంభవించిన బ్యాడ్‌ రికార్డింగ్‌ కావొచ్చు... పాడేవారు బోలెడన్ని టేక్స్‌ తీసుకోవడం లాంటివి కావొచ్చు.. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే సమస్యలతో పనిచేయాల్సి ఉంటుంద’ని వివరించారు సాజిదాఖాన్‌. ఫస్ట్‌లేడీకి ముందుగా రాజీవ్‌గాంధీ ఎక్సలెన్స్‌ అవార్డు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారక సేవారత్న అవార్డు తదితర అందుకుంది. ‘పిల్లల కోసం చిన్న మ్యూజిక్‌ స్కూల్, సొంత స్టూడియో ప్రారంభించాలని ఉంది. అలాగే మన సంప్రదాయ సంగీత శైలులెన్నో అంతరించిపోతున్నాయి. వాటిని భవిష్యత్తు తరాల కోసం జాగ్రత్త పరచాల్సి ఉందని’ తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top