వివక్షతో దేశ సమగ్రతకే విఘాతం | Sakshi
Sakshi News home page

వివక్షతో దేశ సమగ్రతకే విఘాతం

Published Wed, Mar 28 2018 2:41 AM

 Finance Minister is fire on the central government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాలకు సాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తే దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరిం చారు. శాసన మండలిలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేశారు. ‘రాష్ట్రానికి సాయం చేయాలన్న ఇంగిత జ్ఞానం కేంద్రానికి లేకపోవడం శోచనీయం.

మిషన్‌ కాకతీయ, భగీరథలకు రూ.25 వేల కోట్ల వరకు అవసరమని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేస్తే రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు’అని విమర్శించారు. ‘జీఎస్‌డీపీలో 25 శాతం వరకు అప్పులు తీసుకోవచ్చన్న నిబంధనను, 20 శాతానికి కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. కనీసం రాష్ట్రం అప్పులు చేసుకోవడానికి కూడా కేంద్రం అవకాశం ఇవ్వడం లేదు’ అని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ, ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు దేశంలో సామాన్య ప్రజలకు ముఖ్యమైన పథకం ఒక్కటైనా మోదీ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.

ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నాం
‘కేంద్రం ఇస్తుందన్న ఆశలేదు. కాబట్టి మాకు మేమే అభివృద్ధి చేసుకుంటున్నాం. గరీబోళ్లం అంటూ చెప్పి పక్క రాష్ట్రం వాళ్లు బాగుపడ్డారా? మేం అలా అనలేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నాం’ అని ఈటల అన్నారు. ‘దేశాన్ని దోచుకుతింటున్న నీరవ్‌ మోదీ వంటి వారికి బ్యాంకులు రూ.వేల కోట్లు అప్పులు ఇస్తున్నాయి.

అదే సామాన్యుడు రూ.లక్ష అడిగితే వంద రూల్సు చెబుతున్నాయి. రుణమాఫీ సొమ్ము కోసం రిజర్వు బ్యాంకు వద్ద కు వెళితే, కుదరదన్నారు. దేశాన్ని దోచుకునే వారికి వేల కోట్లు ఇస్తున్నారు. ప్రభుత్వాలు మార్వాడీ దుకాణాలు కాదు. ప్రజల సంక్షేమమే వాటి లక్ష్యం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అతిథులుగా అది వారి సంస్కారం..
రాష్ట్ర పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో బీజేపీ నేతలు విమర్శిస్తున్నారంటూ వస్తున్న వ్యాఖ్యలపై మండలిలో బీజేపీ నేత రామచందర్‌రావు సమాధానమిచ్చారు. ‘ఇంటికి వచ్చిన వారికి ఎలా వండి పెట్టినా బాగానే ఉందని చెబుతుంటారు. అతిథులుగా అది వారి సంస్కారం.

కేంద్ర మంత్రులు రాష్ట్రానికి అతిథులుగా వచ్చినప్పుడు సహజంగా పథకాలు బాగున్నాయంటారు. పథకాల్లోని లోపాలను విమర్శించడం రాష్ట్రంలో మా పని. కేంద్ర మంత్రుల పని కాదు’అని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం బాహుబలి సినిమా చూపిస్తోందని, తన కంటే పెద్ద డైరెక్టర్లు ఉన్నారని రాజమౌళి బాధపడతారని ఎద్దేవా చేశారు. మూడో ఫ్రంట్‌ అంటున్నారని, అసలు మీ ఫ్రంట్‌ చూసుకోండని చురకలు వేశారు. అనంతరం మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది.  

ఇవేం విమర్శలు..?
‘వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నానని కాంగ్రెస్‌ నేతలు నన్ను విమర్శించారు. వేల కోట్లా? ఇవేం విమర్శలు. నేను రాజకీయాన్ని కుట్రగా భావించను. ప్రజల కన్నీళ్లు తుడిచే సామాజిక శాస్త్రంగా రాజకీయాలను చూస్తా’ అని ఈటల బదులిచ్చారు. ఇలాంటి సంస్కార హీనమైన పార్టీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement