పెళ్లి విందులో మటన్ వడ్డించలేదని..

పెళ్లి విందులో మటన్ వడ్డించలేదని.. - Sakshi


హైదరాబాద్: పెళ్లి విందులో మటన్ వడ్డింపు వ్యవహారం వధూవరుల బంధువుల మధ్య ఘర్షణకు దారితీసింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..



శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన మణికంఠ వివాహం బాచుపల్లి మల్లంపేటకు చెందిన రజనితో ఈ నెల 18న మల్లంపేటలో ఘనంగా జరిగింది. గురువారం సురభీ కాలనీలోని పెళ్లికొడుకు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక సురభీ కాలనీకి చెందిన ఒక యువకుడు తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ప్లేటు విసిరేశాడు. అతను విసిరిన ప్లేటు వెళ్లి పెళ్లి కూతరు తరఫు బంధువలపైన పడింది. ఆగ్రహానికి గురైన మల్లంపేట వాసులు అతన్ని తీసుకెళ్లి చితకబాదారు. దీన్ని గ్రహించిన స్థానికులు మల్లంపేట వాసులపై దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తమవారిని కొడుతున్నారని సురభీ కాలనీ వాసులు, తమ ఊరి వాళ్లను కొడుతున్నారని మల్లంపేట వాసులు ఆగ్రహాలకు గురై తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు సర్దిచెప్పి పంపించివేయడంతో అర్ధరాత్రి దాటాక మల్లంపేటకు వెళ్లిపోయారు. కానీ..



తిరిగి శుక్రవారం మధ్యాహ్నం మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వివిధ వాహనాలలో వచ్చి సురభీ కాలనీ వాసులపై ఆకస్మాత్తుగా దాడికి దిగారు. కాలనీ పక్కనే రైల్వే ట్రాక్ ఉండటంతో కంకర్ రాళ్లతో దాడి చేయడంతో సురభీ కాలనీకి చెందిన సాయి, చిన్న, చంటి, నాగరాజ్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్రగాయమవడంతో చరణ్ అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా విషయంగా తెలుసుకున్న చందానగర్ ఎస్సై రామారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఘర్షణ తీవ్రంగా ఉండడంతో అదనపు సిబ్బందిని తీసుకొచ్చి ఇరువర్గాలకు చెందిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలు ఒకరిపై కొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top