కిక్-2 చిత్ర ప్రదర్శన కోసం నిర్మాతకు డబ్బులు చెల్లించేందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కళ్లుగప్పి కారు డ్రైవరు రూ. 21 లక్షల నగదు, కారుతో...
రూ. 21 లక్షలు అపహరించిన డ్రైవర్
హైదరాబాద్: కిక్-2 చిత్ర ప్రదర్శన కోసం నిర్మాతకు డబ్బులు చెల్లించేందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కళ్లుగప్పి కారు డ్రైవరు రూ. 21 లక్షల నగదు, కారుతో సహా ఉడాయించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలివీ.. కిక్-2 సినిమా గుంటూరు ప్రదర్శన హక్కుల కోసం బోయినపల్లి సమీపంలోని పేట్‌బషీరాబాద్‌లో నివసించే వాసుదేవరావు చౌదరి గురువారం రాత్రి 8 గంటల సమయంలో రూ. 21 లక్షల నగదును బ్యాగులో పెట్టుకొని తన స్కోడా కారు (ఎ.పి.28 బి.వై. 0235)లో డ్రైవర్ సాయికుమార్ (35)తో కలసి బంజారాహిల్స్ రోడ్ నెం. 2 లోని సాగర్‌సొసైటీలో ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు.
కారులో నగదును ఉంచి డ్రైవర్‌కు చెప్పి కార్యాలయంలోకి వెళ్లారు. సినిమా హక్కులకు సంబంధించి హీరో కల్యాణ్‌రామ్‌తో రెండు గంటలపాటు చర్చించారు. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో కిందకు వచ్చి కారు కోసం చూడగా కనిపించలేదు. డ్రైవర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన వాసుదేవరావు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించినా ఫలితం లేకపోవడంతో.. డ్రైవర్ పరారైనట్లు తెలుసుకొని అదే రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.