‘గాలేరు-నగరి’లో అవినీతి దందా | Corruption comes out from Galeru-Nagari | Sakshi
Sakshi News home page

‘గాలేరు-నగరి’లో అవినీతి దందా

Dec 28 2015 9:16 AM | Updated on Sep 22 2018 8:22 PM

గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్)లో తవ్విన కొద్దీ అవినీతి బయటపడుతూనే ఉంది.

సాక్షి, హైదరాబాద్: గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్)లో తవ్విన కొద్దీ అవినీతి బయటపడుతూనే ఉంది. ప్యాకేజీ-29లో రూ. 12 కోట్ల విలువైన పని అంచనా విలువను రూ. 110 కోట్లకు పెంచి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి కట్టబెట్టినప్రభుత్వం.. ప్యాకేజీ-28లోనూ ఇదే అడ్డగోలు మార్గాన్ని ఎంచుకుంది. రూ. 173.5 కోట్ల విలువైన కాలువ తవ్వకం, బ్రిడ్జిలు లాంటి  నిర్మాణ పనులను 2007లో మార్చి 7న ‘సబీర్ డ్యామ్ అండ్ వాటర్ వర్క్స్’ సంస్థకు అప్పగించింది. అందులో కొన్ని పనులు అసంపూర్తిగా ఉండగా, కొన్ని పనులను కాంట్రాక్టు సంస్థ ఇంకా ప్రారంభించనే లేదు.

రూ. 7 కోట్లు  విలువైన పనులను కాంట్రాక్టర్ ఇప్పటివరకు ప్రారంభించనే లేదు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఉన్న ఒప్పందంలోని 60(సి) నిబంధన ప్రకారం.. ప్రారంభం కాని పనులను ఆ కాంట్రాక్టర్ పరిధి నుంచి అధికారులు తప్పించారు. తానే చేస్తానని కాంట్రాక్టర్ అధికారులకు చెప్పినా వినలేదని,  దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, వారు చెప్పిన వారికి పనులు అప్పగించడానికి వీలుగా ఇలా చేస్తున్నామని, అడ్డుపడితే మిగతా పనులు కూడా చేయలేరని అధికారులు హెచ్చరించడంతో.. కాంట్రాక్టర్ సరే అన్నట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది.
 
పది రెట్లు పెరిగిన అంచనా!
కాంట్రాక్టర్‌నుంచి పనులు తప్పించిన అధికారులు ఆ రూ. 7 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 60 కోట్లకు పెంచారు. అంచనా వ్యయం పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధనను ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో తుంగలో తొక్కారు. ఆ తర్వాత టెండర్ పిలవడానికీ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. సెప్టెంబర్‌లో టెండర్ ఖరారు చేసే దశలో.. ప్యాకేజీ-29 వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్యాకేజీ-29లోనూ రూ. 12 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ. 110 కోట్లకు పెంచి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు పనులు అప్పగించిన తర్వాత.. ముడుపులు చెల్లింపులో మంత్రి దేవినేని ఉమ, అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు విభేదాలు తలెత్తడంతో అవినీతి వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

అదే మార్గంలో అధికార పార్టీ పెద్దల అండదండలతో ప్యాకేజీ-28 వ్యవహారం కూడా సాగడంతో.. అడ్డగోలుగా అంచనా వ్యయం పెంచి టెండర్లు పిలిచిన విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు తప్పవని అధికారులు భావించారు. సెప్టెంబర్‌లో టెండర్లు ఖరారు చేసే దశలో వ్యవహారాన్ని నిలిపివేశారు. ప్యాకేజీ-29 వ్యవహారం సద్దుమణగడంతో.. ప్యాకేజీ-28లో అంచనా వ్యయం పెంపు ఆమోదం కోసం ఫైల్‌ను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ముఖ్య కార్యదర్శి, మంత్రితో ఆమోదముద్ర వేయించడానికి అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఆమోదానికి ఫైల్ సిద్ధం చేసింది. అంచనా వ్యయం పెంపునకు వీలుగా మార్చిన డిజైన్స్‌కు ఆమోదముద్ర వేయాలంటూ మరో ఫైల్ సీడీవో(సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు చేరింది. తక్షణం ఆమోదం తెలిపి ఎస్‌ఎల్‌ఎస్‌సీకి పంపించాలని ప్రభుత్వ పెద్దల నుంచి సీడీవో అధికారుల మీద ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. అడ్డగోలు వ్యవహారానికి ప్రభుత్వం త్వరలో ఆమోదముద్ర వేస్తుందని అధికార పార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement