
వెంకటేష్ నాయుడు ప్రయాణించింది అందులోనే
చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరితోనూ సంబంధాలు
వారందరితో దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనం
అయినా వైఎస్సార్‌సీపీ నేతలకు సన్నిహితుడని టీడీపీ బుకాయింపు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అభాసుపాలై డైవర్షన్ వ్యవహారాలకు తెరదీస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరో తప్పుటడుగు వేసింది. ఈ కేసులో ఒక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఉపయోగించిన ప్రత్యేక విమానం బీజేపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్దనే విషయం బయటపడడంతో టీడీపీ అభాసుపాలైంది. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ విమానంలో ఈ ఏడాది ఏప్రిల్ 13న వెంకటేశ్ నాయుడు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు.
హైదరాబాద్‌కు చెందిన మధు క్రియేషన్స్ రూ.17 లక్షలతో ఈ విమానం టికెట్‌ను బుక్ చేసింది. వీటీ వీఐఎన్ టైప్‌కి చెందిన ఈ ప్రత్యేక విమానంపై సీఎంఆర్ (సీఎం రమేష్) అనే పేరు కూడా రాసి ఉంది. అందులోనే సినీ నటి తమన్నా కూడా ప్రయాణించారు. ఆమె పక్క సీటులో కూర్చున్న వెంకటేష్ నాయుడి ఫొటోలను మాత్రమే సిట్ విడుదల చేసి తప్పుడు ప్రచారం చేసింది. దీంతో వెంకటేష్ నాయుడు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలకు ప్రధాన అనుచరుడని టీడీపీ నేతలు, సిట్ చేసిన ప్రచారం అంతా తప్పని తేలిపోయింది.
సీఎం రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ఆయన్ను బీజేపీలోకి పంపారు. రమేష్ బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పని చేస్తున్నారనే విషయం కూడా తెలిసిందే. మద్యం అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ నేతలపై ఎడాపెడా బురద జల్లే క్రమంలో సిట్, ఎల్లో మీడియా.. వెంకటేష్ నాయుడు డబ్బు లెక్కిస్తున్న ఎప్పటివో పాత వీడియోలు విడుదల చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అతను టీడీపీకే అత్యంత అనుకూల వ్యక్తని తేలిపోయింది.
సీఎం రమేష్ విమానాన్ని ఉపయోగించడమే కాదు..చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసానితో వెంకటేష్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. హైదరాబాద్‌లో దొరికినట్లు చెబుతున్న రూ.11 కోట్ల వ్యవహారంలో బుక్కయిన టీడీపీ.. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వెంకటేష్ వీడియోలు విడుదల చేసిందని స్పష్టమైంది. ఇప్పుడీ వ్యవహారమూ బెడిసికొట్టింది.
