
కరీంనగర్: బీఆర్‌ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్‌ఎస్‌ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం రమేశ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
‘సిరిసిల్ల టికెట్‌ను మొదట కేటీఆర్‌కు ఇవ్వకపోతే, టికెట్ ఇప్పించాలని సీఎం రమేశ్‌ని కలిశారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్ టికెట్ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్ సవాల్‌పై కేటీఆర్ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు.
కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు.
అదంతా అవాస్తవం: సీఎం రమేశ్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు.