వికారాబాదు జిల్లా: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని బిల్‌కల్‌లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చేరాల నర్సింలు (39) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. మూడు నెలలుగా తన ప్రియురాలితో నర్సింలు కొంత దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె తరచూ నర్సింలుకు ఫోన్ చేస్తోంది. నర్సింలు ఆమెతో మాట్లాడుతుండగా భార్య వసంత ఫోన్ లాక్కుని హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింలు ప్రియురాలు వసంతను దుర్భాషలాడింది. నిన్ను చంపి, నీభర్తతోనే ఉంటానని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసిన నర్సింలు పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. ఉదయం పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో వసంత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. కొద్ది సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో నర్సింలు విగత జీవిగా, రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది.
డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
విషయం తెలుసుకున్న మర్పల్లి ఎస్‌ఐ రవూఫ్, మోమిన్‌పేట్ సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయగా ఘటనా స్థలం వద్ద పలు బండరాళ్లను గుర్తించారు. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ వెంచర్ వద్దకు వెళ్లిన జాగిలం అక్కడే ఆగిపోయింది.
కుటుంబీకుల ఆందోళన
నిందితులను గుర్తించే వరకూ శవాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని మృతుడి బంధవులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాడీని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వసంత, కుమారులు సాయికృష్ణ, శ్రీహరి ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి తన భర్తను బండరాళ్లతో కొట్టి హత్య చేశారని వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


