
ఈడీ, సీబీఐ పేరుతో భయపెడితే బీజేపీలోకి వెళ్లామన్నారు
జీవితకాలంలో ఎక్కువ రోజులు బాబు ఇంట్లో, ఢిల్లీలోని రేవంత్ ఇంట్లోనే ఉన్నావ్
సీసీటీవీ ఫుటేజీ తీద్దామా..
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళితే తప్పు ఏంటి? మమ్మల్ని ఈడీ, సీబీఐ పేరుతో భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని..మేం ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ మాతో చెప్పారు’ అని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నీ జీవితకాలంలో ఎక్కువ రోజులు.. చంద్రబాబు ఇంట్లో, ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలోనే ఉన్నావు. సీసీటీవీ ఫుటేజీ తీద్దాం పదా.. నువ్వు, నీ తమ్ముడు ఎన్ని రోజులు తుగ్లక్ రోడ్‌లోని నివాసంలో ఉన్నారో చూద్దాం’ అని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఆదివారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడా రు. ‘రేవంత్‌రెడ్డి మాటలు వింటే గోబెల్స్ ఆత్మహత్య చేసుకుంటారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ గోబెల్స్‌ను మించిపోయారు. జైపాల్‌రెడ్డికి ఉన్న మంచిపేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి..నాడు నోట్ల కట్టలతో దొరికినట్టు..నేడు బనకచర్ల విషయంలో దొరికిపోయారు. రేవంత్‌రెడ్డి కుర్చీలో ఐదేళ్లు ఉండాలని మేము కోరుతున్నాం. కానీ, ఆయనన్ను ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఎవరెవరు రెచి్చపోతున్నారో వాళ్ల సంగతి మేం చూసుకుంటాం’అని జగదీశ్‌రెడ్డి అన్నారు.
‘పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారు. బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్‌ఎస్ భావజాలం వేరు..బీజేపీ భావజాలం వేరు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారు. బీజేపీ వచ్చి బీఆర్‌ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు’అని జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడు తున్న రేవంత్‌రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిస్తున్న వారు రేవంత్‌రెడ్డి పరువు తీస్తున్నారు. సహచర మంత్రులంటే భయంతోనే సీఎం వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. అందుకే ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు’అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.