'బొక్కలు' బుక్కుతున్నరు!

Corporate and private hospitals danda with the name of aarogyasri - Sakshi

ఎముకలు విరిగితే నాసిరకం పరికరాలు అమర్చుతున్న ఆస్పత్రులు

వెంటనే ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్న రోగులు

ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రుల దందా

నాణ్యతలేని ప్లేట్లు, స్క్రూల బిగింపు

ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారుల కుమ్మక్కు  

హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎన్‌.రాజేశ్‌ ద్విచక్ర వాహనంపై ఆఫీసుకు బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో అక్కడే పడిపోయాడు. వెంటనే సమీపంలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆరోగ్యశ్రీ అధికారుల ఆమోదంతో ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఇంటికి పంపారు. అయితే వెళ్లిన రెండో రోజే ఎడమ కాలిలో నొప్పి మొదలైంది. ఆస్పత్రికి వెళ్తే ఇన్‌ఫెక్షన్‌ సోకిందని చెప్పారు. మరోసారి శస్త్ర చికిత్స చేసి పంపారు.

జనగామ జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా మేస్త్రీ రమణ కాలు జారి కింద పడ్డాడు. అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మోకాలి భాగంలో శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఆధారంగా చికిత్స చేసి పది రోజుల తర్వాత ఇంటికి పంపించారు. రెండు నెలల తర్వాత పనికి వెళ్దామంటే రమణ శరీరం సహకరించలేదు. కాలు లాగడం, తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షిస్తే ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, మళ్లీ శస్త్ర చికిత్స అవసరమని చెప్పారు. రెండోసారి శస్త్ర చికిత్స చేయడంతో రమణ ఆరు నెలలపాటు ఏ పనికి వెళ్లలేకపోయాడు.

ఈ రెండు కేసుల్లోనూ నాసిరకం ఔషధ పరికరాలను అమర్చడం వల్లే ఇన్‌ఫెక్షన్‌ సోకిందని ఆరోగ్యశ్రీ విజిలెన్స్‌ విభాగం నిర్ధారించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు యథావిధిగా విజిలెన్స్‌ విభాగం సూచనలను పక్కన పెట్టేశారు. ఇలా పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం అధికారుల కక్కుర్తితో అస్తవ్యస్తంగా మారుతోంది. సేవల పరంగానే కాకుండా శస్త్ర చికిత్సల్లోనూ నాసిరకం పరికరాలను అమర్చి రోగుల జీవితాలను ప్రైవేటు ఆస్పత్రులు నాశనం చేస్తున్నాయి.   – సాక్షి, హైదరాబాద్‌

నాసిరకం వైద్యం..
ప్రమాదవశాత్తు ఎముకలు విరిగిన వారికి మెరుగైన చికిత్స అనేది కష్టంగా మారుతోంది. విరిగిన ఎముకలు మళ్లీ అతుక్కునేందుకు అవసరమైన కట్లు, శస్త్ర చికిత్సలో నాసిరకం వైద్యం ఉంటోంది. శస్త్ర చికిత్స చేసేటప్పుడు నాణ్యతలేని ప్లేట్లు, స్క్రూలను బిగిస్తున్నా.. ఆరోగ్యశ్రీ అధికారులు ఇవేమి పట్టించుకోవడంలేదు. రోగులు ఇంటికి చేరేలోపే శస్త్ర చికిత్స చేసిన ప్రదేశంలో ఇన్‌ఫెక్షన్లు జరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఎముకల శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో గరిష్టంగా నాలుగు శాతం రోగులు మాత్రమే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంది. కానీ మన రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల్లో మాత్రం 15 శాతం రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ విజిలెన్స్‌ విభాగం పరిశీలనలో నాసిరకం శస్త్ర చికిత్సల విషయం వెలుగు చూసింది. అయినా ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

949 రకాల చికిత్సలు
ఆరోగ్యశ్రీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 949 రకాల చికిత్సలు అందిస్తోంది. పేదలకు కార్పొరేట్‌ వైద్యం కోసం ఏటా రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఆరోగ్యశ్రీలో ఎక్కువగా ఎముకల శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయి. ఒక్కో శస్త్ర చికిత్సకు రూ.32 వేలను ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లిస్తారు. ఒకేసారి రెండు ఎముకలకు శస్త్రచికిత్స చేస్తే రూ.16 వేలు అదనంగా చెల్లిస్తారు.  

ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం
మరోవైపు ఆరోగ్యశ్రీ వైద్యాధికారుల ఆమోదం లేకుండానే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని అంతర్గత విచారణలో తేలింది. ఆరోగ్యశ్రీ మొదలైన ఏడాది (2007)లో ఎముకల చికిత్స కోసం రూ.10 కోట్లు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.100 కోట్లు దాటింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎముకల వైద్య చికిత్స నిపుణులు పూర్తి స్థాయిలో లేరు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

ఎముకలు విరిగిన సందర్భాల్లో ఎక్కువగా శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయి. విరిగిన ఎముకలు సవ్యంగా ఉండేందుకు లాకింగ్‌ నెయిల్స్, స్క్రూలు, క్లిప్‌లు, రాడ్స్‌ అమర్చుతారు. టైటానియంతో తయారు చేసిన పరికరాలనే వినియోగించాల్సి ఉండగా.. తక్కువ ధరకు లభ్యమయ్యే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరికరాలను వాడుతున్నారు. దీంతో ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎముకల చికిత్సలు, చెల్లింపులు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top