20 నుంచి కాంగ్రెస్ పోరుబాట | congress porubata from 20th october :N.uttam kumar reddy | Sakshi
Sakshi News home page

20 నుంచి కాంగ్రెస్ పోరుబాట

Oct 15 2016 2:31 AM | Updated on Oct 16 2018 8:27 PM

20 నుంచి కాంగ్రెస్ పోరుబాట - Sakshi

20 నుంచి కాంగ్రెస్ పోరుబాట

‘రుణమాఫీ చేయండి సీఎం సారూ..’ అంటూ ఈ నెల 20 నుంచి పెద్దఎత్తున రైతులతో ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.

రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉద్యమిస్తాం: ఉత్తమ్ కుమార్

 సాక్షి, హైదరాబాద్: ‘రుణమాఫీ చేయండి సీఎం సారూ..’ అంటూ ఈ నెల 20 నుంచి పెద్దఎత్తున రైతులతో ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్యులతో శుక్రవారమిక్కడ గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు, విద్యార్థి సమస్యలపై నెలరోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 20న మహబూబాబాద్(మానుకోట) నుంచి రైతు ఉద్యమాన్ని రైతుగర్జనతో ప్రారంభిస్తామని చెప్పారు. రుణమాఫీ చేయాలంటూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఈ నెల 21న ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయాలంటూ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అధికారంలోకి ఎలాగైనా రావాలనే దుర్బుద్ధితో అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశారని ఉత్తమ్ విమర్శించారు. రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను మోసం చేసిన సీఎంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

‘‘అప్పుల బారిన పడి ఇప్పటికే దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే సీఎంకు కనిపించడంలేదు. పైగా రైతులు సంతోషంగా ఉన్నారని, పండుగలు చేసుకుంటున్నారని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేంద్రం ఇచ్చిన రూ.700 కోట్లను కూడా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కాలేజీలకు ఫీజులను రీయింబర్స్ చేయకపోవడంతో 3 లక్షల మంది బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది జీతాలు అందక తిప్పలు పడుతున్నారు.

ఫీజులు వచ్చేదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటున్న కాలేజీల తీరుతో 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి, రైతు నుంచి దరఖాస్తులు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, ఎం.కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఉద్దెమర్రి నర్సింహ్మారెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement