బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు | Benefits to Brahmin students | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

May 6 2017 12:50 AM | Updated on Jul 11 2019 5:01 PM

బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు - Sakshi

బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ నిర్ణయించింది.

రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో పరిషత్‌ కార్యవర్గ సమావేశం అనంతరం పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి వివరాలను మీడియాకు వివరించారు. బ్రాహ్మణ విద్యార్థులకు శ్రీ సరస్వతి విద్యాప్రశస్తి అనే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పథకం కింద చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇస్తామన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి తత్సమాన పరీక్షలో 90 శాతం మార్కులు ఆపైన సాధించిన విద్యార్థులకు రూ.7,500 నగదు పురస్కారం ఇస్తామన్నారు.

పాలిటెక్నిక్‌ తత్సమాన పరీక్షల్లో 90 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారికి రూ.15 వేలు, పీజీలో 70 శాతంతో ఉత్తీర్ణులయినవారికి రూ.20 వేలు, ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యలో 80 శాతం మార్కులు సాధించినవారికి రూ.35 వేల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌–1, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే బ్రాహ్మణ యువతీ యువకులకు వారు తీసుకునే శిక్షణ వ్యయాన్ని ‘లక్ష్య’పథకం ద్వారా అందిస్తామన్నారు.

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యా ఉపకార వేతనం పథకం కింద ఏడాది కోర్సుకు రూ. 10 లక్షలు, ఏడాది నుంచి రెండేళ్ల కాలవ్యవధిగల కోర్సుకు రూ. 15 లక్షలు, రెండేళ్లు ఆ పైబడిన కోర్సుకు రూ. 20 లక్షల సహాయాన్ని అందజేస్తామన్నారు. వేద విద్యను పోత్సహించేందుకు వేద విద్యార్థులకు నెలకు రూ.500 స్టైపండ్‌ ఇస్తామన్నారు. అలాగే 75 ఏళ్లు పైబడిన వేద, సంస్కృత, శాస్త్ర పండితులకు వృద్ధాప్యంలో ఆసరా కల్పించేందుకు నెలకు రూ. 2,500 గౌరవ భృతి కల్పించనున్నట్లు రమణాచారి చెప్పారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడే బ్రాహ్మణ కుటుంబాలకు వారి చికిత్సకయ్యే ఖర్చులో రూ. 2 లక్షల మేరకు ఇన్యూరెన్స్‌ కంపెనీలు అందిస్తాయని పరిషత్‌ సభ్యులు డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలచారి తెలిపారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా పథకాల కింద ఆర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పరిషత్‌ తోడ్పాటునందిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోని గోపన్నపల్లిలో నిర్మించనున్న బ్రాహ్మణ సదనానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వచ్చే నెల 5న శంకుస్థాపన చేస్తారని జ్వాలా నరసింçహారావు తెలిపారు. ఈ నెల 9న బ్రాహ్మణ పరిషత్‌ అధికారిక వెబ్‌ సైట్‌  (www. brahminparishad. telangana. gov. in) ప్రారంభిస్తామని వెల్లడించారు. కంచి కామకోటి పీఠం వారు హైదరాబాద్‌లో నెలకొల్పనున్న సంప్రదాయ పాఠశాలల్లో బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్‌ సభ్యులు పురాణం సతీశ్, డాక్టర్‌ సువర్ణ సులోచన, దేవాదాయ కమిషనర్‌ శివశంకర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement