కోవర్టులతో జర భద్రం ...! | be safe coverts | Sakshi
Sakshi News home page

కోవర్టులతో జర భద్రం ...!

Jan 17 2016 1:16 PM | Updated on Mar 18 2019 9:02 PM

కోవర్టులతో జర భద్రం ...! - Sakshi

కోవర్టులతో జర భద్రం ...!

ఏవైనా ఎన్నికలనగానే కాంగ్రెస్ నేతలకు ముందుగా ఒక భయం పట్టుకుంటున్నదట.

ఏవైనా ఎన్నికలనగానే కాంగ్రెస్ నేతలకు ముందుగా ఒక భయం పట్టుకుంటున్నదట. సొంత పార్టీలోనే ఉంటూ వైరిపక్షాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయం చేస్తున్న విభీషణుల పట్ల ఎక్కువగా జాగ్రత్త పడాల్సి వస్తోందని వాపోతున్నారట. జీహేచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలి స్థానిక ఎమ్మెల్సీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి తగిన బలమున్నా కొన్నిసీట్లను ఓడిపోవడం, ఒకజిల్లాలో పార్టీ అభ్యర్థే ఏకంగా అధికారపార్టీకి మద్దతుగా విరమించుకుని అందులో చేరడం వంటివి ‘హస్తం’ పక్షంవారికి మింగుడుపడడం లేదట. మరీ రంగారెడ్డిజిల్లాలో ఎమ్మెల్సీ గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలమున్నా ఓడిపోవడం పట్ల అధిష్టాననేతలే ఒకింత ఆశ్చర్యపోయారు.

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన  అధిష్టానదూత దీనిపై తన డిప్యూటీని పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలంటూ ఆర్డర్ ఇచ్చేశారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్థుల ఎంపికనుంచే ఆచితూచి వ్యవహరించాలని నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో పోటీచేసి నాలుగైదు స్థానాల్లో నిలవడమే కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన నేతల సిఫార్సులకు అనుగుణంగా టికెట్లు ఇవ్వొద్దనే తాఖీదును కూడా అధిష్టానం దూత రాష్ట్రనేతలకు ఇచ్చారట.

దీనితో తమ వారికి టికెట్లు ఇప్పించుకోవాలని కలలుకన్న ఢిల్లీస్థాయి నేతలు, మాజీమంత్రుల గొంతుల్లో వెలక్కాయ పడ్డట్టయ్యిందట. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు నేర్పిన అనుభవంతోనైనా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కొంతమేరకైనా పరువునిలబడదనే అభిప్రాయానికి పార్టీ నాయకులు వచ్చారట. చివరకు గెలిచిన వారిని సైతం హైజాక్ కాకుండా కాపాడుకోవడంతోపాటు పార్టీలోని కోవర్టుల పట్ల సదా పారాహుషార్‌గా ఉండాలంటూ ఫిక్స్ అయ్యారట...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement