అక్రమ ఫైనాన్స్‌లో ఖాకీలు | ASI mohanreddy chitfund finance | Sakshi
Sakshi News home page

అక్రమ ఫైనాన్స్‌లో ఖాకీలు

Nov 27 2015 2:32 AM | Updated on Aug 20 2018 5:11 PM

అక్రమ ఫైనాన్స్‌లో ఖాకీలు - Sakshi

అక్రమ ఫైనాన్స్‌లో ఖాకీలు

ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

మోహన్‌రెడ్డి వడ్డీల దందాలో పలువురి పెట్టుబడులు
సీఐడీ డీఎస్పీ, మాజీ డీఎస్పీ, ఓ ఏఎస్పీ, సీఐలు..
డాక్టర్లు, వ్యాపారులూ భాగస్వాములే
చిట్టా విప్పిన జ్ఞానేశ్వర్, మహిపాల్‌రెడ్డి
కోర్టుకు వివరాలు సమర్పించిన సీఐడీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మోహన్‌రెడ్డి అకౌంటెంట్ జ్ఞానేశ్వర్, అనుచరుడు సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి సీఐడీ విచారణలో మరికొందరు పేర్లను వెల్లడించారు. మోహన్‌రెడ్డి ఫైనాన్స్‌లో గోదావరిఖని ఎస్సై నాయుడు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు వారు తెలిపారు. అలాగే అప్పటి డీఎస్పీ హబీబ్‌ఖాన్, చొప్పదండి సీఐ లక్ష్మీబాబు మోహన్‌రెడ్డి దందాకు పూర్తిగా సహకరించినట్లు పేర్కొన్నారు.
 
 హబీబ్‌ఖాన్ ప్రస్తుతం ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరితోపాటు జిల్లాలోని పలువురు వ్యాపారులు, డాక్టర్లు, అడ్వొకేట్లు కూడా మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందాలో పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. గురువారం జ్ఞానేశ్వర్, మహిపాల్‌రెడ్డిని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా విచారణలో వెల్లడైన అంశాలను కోర్టు ముందుంచారు. అనంతరం జ్ఞానేశ్వర్, మహిపాల్‌రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
 
 పెట్టుబడులు పెట్టింది వీరే..
 మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందాలో పోలీసు ప్రముఖులతోపాటు డాక్టర్లు, లాయర్లు, రిజిస్ట్రార్‌లతో పాటు పలు ప్రముఖులు పెట్టుబడులు పెట్టినట్లు జ్ఞానేశ్వర్ తెలిపాడు. కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం... ఏఎస్పీ జనార్దన్‌రెడ్డి రూ.90 లక్షలు, సీఐడీ డీఎస్పీ భాస్కర్ రూ.10 లక్షలు, సీఐడీ సీఐ ప్రకాశ్ రూ.20 లక్షలు, సీఐ సీహెచ్ మల్లయ్య రూ.20 లక్షలు, ఎస్సై బుచ్చిరాములు రూ.20 లక్షలు, ఎస్సై నాయుడు రూ.20 లక్షలు, మోహన్‌రెడ్డి మిత్రుడు కిరణ్‌రావు రూ.3 కోట్లు, డాక్టర్ భూంరెడ్డి కూమారుడు సూర్యనారాయణరెడ్డి రూ.90 లక్షలు, పద్మ రూ.50 లక్షలు, అన్నాడి సుజాత రూ.20 లక్షలు, బద్ధం రాంరెడ్డి రూ.10 లక్షలు, పుల్గం మల్లేశం రూ.4 లక్షలు, పుల్గం రాజయ్య రూ.4 లక్షలు, సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి రూ.7.5 లక్షలు, సింగిరెడ్డి ఎల్లారెడ్డి రూ.2 లక్షలు, వజ్రమ్మ రూ.50 వేలు, జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసి ఏసీబీ కేసులో సస్పెండైన మల్లికార్జున్ రూ.20 లక్షలు పెట్టుబడులు పెట్టినట్లు జ్ఞానేశ్వర్ తెలిపాడు. మరోవైపు సీఐడీ పోలీసులు ఈ కేసులో కస్టడీలోకి తీసుకున్న పూర్మ శ్రీధర్‌రెడ్డిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన కస్టడీ గడువు ముగియడంతో రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement